14-10-2025 08:42:03 PM
ఏఐసీసీ పరిశీలకుడు మానే శ్రీనివాస్...
మానకొండూరు (విజయక్రాంతి): సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సమర్థులను జిల్లా, బ్లాక్, మండల పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేయడమే సంఘటన్ సృజన్ అభియాన్ ఉద్దేశమని ఏఐసీసీ పరిశీలకుడు మానే శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక కోసం మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని అరుంధతీ ఫంక్షన్ హాల్ లో పార్టీశ్రేణుల అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో పటిష్టవంతంగా పార్టీ నిర్మాణ బాధ్యతలు జిల్లా అధ్యక్షులకే అధికంగా ఉంటుందని, అందుకే సమర్థత గల నాయకునికే పార్టీ జిల్లా నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్నదే అధిష్టానం ఉద్దేశమన్నారు.
కాంగ్రెస్ పార్టీ నూతనంగా ప్రవేశపెట్టిన నూతన విధానం పార్టీ పటిష్టతకు దోహదపడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎంపిక మాదిరిగానే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని ఆయన వివరించారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ కోసం కష్టపడ్డవాళ్లకు పార్టీ తప్పకుండా గుర్తించి ఆదరిస్తుందన్నారు. గెలుపు వెనక కార్యకర్తల కష్టం ఉంటుందని, వారు కష్టపడకుంటే నేతలెవరూ అందలమెక్కరన్నారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకుండా పార్టీ పటిష్టత కోసం అందరం కలిసి కట్టుగా పని చేయాలన్నారు. పార్టీకి నష్టం కలిగించే పనులకు దూరంగా ఉండాలని ఆమె హితవు పలికారు.
సభాధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నివర్గాల వర్గాల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నదన్నారు. ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవల్సిన బాధ్యతమ మనందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా పారదర్శకంగా అధ్యక్షుని ఎంపిక జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సమావేశంలో టీపీసీసీ ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి (మానకొండూర్), గోపగోని బస్వయ్యగౌడ్(శంకరపట్నం), బండారి రమేశ్(తిమ్మాపూర్), ముస్కు ఉపేందర్ రెడ్డి(గన్నేరవరం), ముక్కిస రత్నాకర్ రెడ్డి( బెజ్జంకి), కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి(ఇల్లంతకుంట)తోపాటు పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.