calender_icon.png 26 October, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగడుగునా అడ్డంకులే!

26-10-2025 12:00:00 AM

డాక్టర్ తిరునహరి శేషు :

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోగా స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు కూడా ప్రతి సందర్భంలో వివాదాస్పదంగా మారటం జరుగుతూనే ఉన్నది. 73, 74 రాజ్యాంగ సవరణల తర్వాత 1994లో ఆర్టికల్ 243 (డి)(టి) ద్వారా బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. కానీ బీసీలకు ఒక నిర్దిష్ట పరిమాణంలో రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్ల 2010లో కే.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు లో ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించాలని సుప్రీంకోర్టు తీర్పుతో తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి.

తెలంగాణ రాష్ర్ట ఏర్పా టుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో జరిగిన స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను కాపాడుకోటానికి సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తరువాత 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజ ర్వేషన్లు 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గిపోవటానికి ప్రస్తుతం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచటానికి కూడా కోర్టు వివాదాలే అడ్డుపడుతున్నాయి.

దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ విద్య, ఉద్యోగాలలో బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లపై వివాదాలు ఏర్ప డటం కోర్టుల్లో కేసులు వేయటంతో దశాబ్దాలుగా రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందనే భావన బలహీన వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. 

మోకాలడ్డు ఎందుకు?

దేశంలోనూ, రాష్ర్టంలోనూ ఆది నుం చి బలహీన వర్గాల రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 1953 కాకా ఖలేల్కర్ కమిషన్, 1979 మండల్ కమిషన్, 2017 జస్టిస్ రోహిణి కమిషన్‌ను అమలుకాకుండా అడ్డుకున్న విధంగానే మండల్ కమిషన్ సిఫారసులను అమలు కాకుండా ఒక దశాబ్ద కాలం పాటు తొక్కిపెట్టిన విధంగానే, చట్టాలను కోర్టులను అడ్డం పెట్టుకొని బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు.

1992 ఇందిరా సహాని కేసు నుంచి నేటి బి.మాధవరెడ్డి కేసు వరకు రిజర్వేషన్లను అమలు కాకుండా వేసిన కేసు లే కదా! తెలంగాణ రాష్ర్టంలో 243 కులాలు ఉంటే 2013, 2018, 2025లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కోర్టులకు వెళ్లి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వే షన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటా న్ని బలహీనవర్గాలు ఎలా అర్థం చేసుకోవాలి.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024 ప్రకారంగా తెలంగాణ రాష్ర్టంలో 18 శాతం ఉన్న అగ్రవర్ణాలకి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తుం టే, 56 శాతం ఉన్న బలహీన వర్గాలకు విద్యా ఉద్యోగాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్లు కేవలం 29 శాతం మాత్రమే కదా! అలాగే 18 అగ్రవర్ణ కులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే 134 బీసీ కులాలకు ఇస్తున్న రిజర్వేషన్లు 29 శాతమే కదా! బీసీ గ్రూపులో 57 కులాలు ఉంటే వారికి ఇస్తున్న రిజర్వేషన్ ఏడు శాతమే.

స్థానిక సంస్థల్లో కూడా 56 శాతంగా ఉన్న 134 బీసీ కులాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం సామాజిక న్యాయం కిందకే వస్తుంది. మరి ఎందుకు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 134 బీసీ కులాల్లో 80 కులాలకు ఇప్పటివరకు గ్రామ సర్పంచి పదవులు దక్కలేదు. 50 కులాలకి వార్డు మెంబర్ పదవులు కూడా దక్కలేదు. రిజర్వేషన్లు ఉంటేనే ఆ కాస్తయినా రాజకీయ ప్రాతినిధ్యం బలహీనవర్గాలకు దక్కుతుం ది.

బీసీలకు రిజర్వేషన్లు లేని చట్టసభల్లో దక్కుతున్న ప్రాతినిధ్యం ఎంత అనేది ఆలోచించాలి. ప్రస్తుత తెలంగాణ శాసనసభలో బీసీల ప్రాతినిధ్యం కేవలం 15 శాతం మాత్రమే ఉంటే.. ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన ప్రాతినిధ్యం 36 శాతంగా ఉండడం గమనార్హం. మొత్తం అగ్రవర్ణాల ప్రాతినిధ్యం 52 శాతంగా ఉంది. చట్టసభల్లో బీసీలకు ఎలాగూ రిజర్వేషన్లు లేవు.. కనీసం స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు, పెరగకుండా చేసే ప్రయత్నాలు చేయడం చూస్తుంటే సామాజిక న్యాయంపై నమ్మకం కోల్పోతున్నట్లే.

పరిమితికి అర్థముందా!

2019లో అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో రిజర్వేషన్లు లేని కులాలే లేవు. కాబట్టి రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే పరిమితికి కూడా అర్థం లేదు. అగ్రవర్ణాల్లో పేదల శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి కాబట్టి జాతీయ పోటీ పరీక్షల్లో, రాష్ర్ట స్థాయి పోటీ పరీక్షల్లోనూ ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాల కంటే తక్కువ ర్యాంకుతోనే అగ్రవర్ణాలు అవకాశాలు పొందుతున్నారు.

సివిల్ సర్వీసెస్, గ్రూప్ వన్ లాంటి ఉద్యోగాల్లో కూడా తక్కువ ర్యాంకులతో అగ్రవర్ణాలు ఎంపికవుతున్నారు. కాబట్టి రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి ఆయా వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. జస్టిస్ రోహిణి కమిషన్ ప్రకారంగా దేశంలో 2600 ఓబీసీ కులాలు ఉంటే 984 కులాలకి ఇప్పటివరకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు దక్కలేదు,

మరొక 983 కులాలకి కేవలం 2.4 శాతం ఫలాలు మాత్రమే దక్కాయి. కాబట్టి కింది వర్గాలకు, కులాలకు కూడా రిజర్వేషన్ల ఫలాలు దక్కాలంటే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

రిజర్వేషన్ల సాధన ఎలా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించటానికి రాష్ర్ట ప్రభుత్వం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. రిజర్వేషన్ల కోసం రాష్ర్ట శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు రాష్ర్టపతి వద్ద పెండింగ్, పంచాయతీరాజ్ చట్టానికి ప్రతిపాదించిన సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్, చివరికి రిజర్వేషన్ల కల్పన కోసం రాష్ర్ట ప్రభుత్వము జారీ చేసిన జీవో నెంబర్ 9 పై న్యాయస్థానాలు స్టే విధించిన నేపథ్యంలో రిజర్వేషన్ల సాధనకి రాష్ర్ట ప్రభుత్వం తన వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉం ది.

న్యాయస్థానాల ద్వారా రిజర్వేషన్లు సాధించే అవకాశాలు లేవు. కాబట్టి చట్ట ప్రక్రియ ద్వారానే రిజర్వేషన్లు సాధించిన తమిళనాడు అనుభవాలను పరిగణలోకి తీసుకుంటూ పార్లమెంటరీ ప్రక్రియ ద్వా రా చట్ట రూపంలో రిజర్వేషన్ల సాధనకు సంబంధించిన మార్గాలను వెతకాలి. రిజర్వేషన్ల సాధనకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ర్టంలోని రాజకీయ పార్టీ లు, సామాజిక సంఘాలు అఖిలపక్షంగా ఏర్పడి రిజర్వేషన్ల సాధనకై కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.

రిజర్వేషన్ల సాధనలో ఏర్పడుతున్న అడ్డంకులను అధిగమించటానికి రాష్ర్ట ప్రభుత్వం రాజ్యాంగ న్యాయ నిపుణులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి డెడికేటెడ్ కమిషన్ ద్వారా రిజర్వేషన్లను ఎందుకు పెంచాల్సిన అవసరం ఉందో బలమైన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచి రిజర్వేషన్లను సాధించాలి. రాష్ర్టంలో ఎంబీసీలకు, సం చార జాతులకు దక్కని రాజకీయ ప్రాధాన్యతను, జస్టిస్ రోహిణి కమిషన్ సిఫార సులను పరిగణలోకి తీసుకొని సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్ల విషయంలో ప్రధానమంత్రి మోదీ జోక్యం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడులో రిజర్వేషన్లు 69 శాతానికి పెంచడానికి జయలలితకు పీవీ నరసింహారావు సహకరించిన విధంగానే తెలంగాణ రాష్ర్టంలోనూ 42 శాతం రిజర్వేషన్ల సాధనకై రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ కూడా సహకరించాలని బలహీన వర్గాల సమాజం కోరుకుంటుంది. రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ అంశంగా చూడకుండా ఒక సామాజిక వెనుకబాటు సమస్యగా పరిగణించి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెండూ కలిసి రిజర్వేషన్ల సమస్యకి ఒక పరిష్కారం చూపించాలని ఆశిద్దాం. 

 వ్యాసకర్త సెల్: 9885465877