20-09-2025 12:00:00 AM
-ఇప్పటికే రెండుసార్లు టెట్ నిర్వహణ
-డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న 2.50లక్షల మంది అభ్యర్థులు
-ఈఏడాది ఫిబ్రవరిలోనే వేస్తామని జాబ్ క్యాలెండర్‌లో సర్కార్ వెల్లడి
-ఏడు నెలలవుతున్నా టీచర్ పోస్టుల భర్తీపై నిర్ణయం ప్రకటించని ప్రభుత్వం
-టీచర్ల కొరతే లేదంటున్న విద్యాశాఖ అధికారులు
-నోటిఫికేషన్ జారీ చేయాలంటున్న అభ్యర్థులు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎ ప్పుడెప్పుడు శుభవార్త చెబుతుందా? అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. ప్రభుత్వం మా త్రం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అంశంపై ఇంత వరకూ స్పష్టత ఇవ్వ డం లేదు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఇతర పాఠశాలల్లో దాదాపు 13వేల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ఆగస్టు నెలలో పూర్తి చేయడంతో టీచర్ పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. దీనికితోడు పదవీ విరమణ పొందినవి, క్లియర్ వేకన్సీలు కలుపుకుంటే భారీగానే ఖాళీలున్నాయి. ఇలా మొత్తం 13వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు లెక్కల్లో తేలిందని విద్యాశాఖలోని ఓ అధికారి తెలిపారు.
జిల్లాల్లో భారీగానే..
రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది టీచర్లకు గానూ 1.07 లక్షలమంది వరకు ప్రస్తుతం కొనసాగుతున్నారు. మరో 13వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో కనీసం 300కుపైగానే టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో 400 వరకు ఖాళీలున్నట్లు తెలిసింది. ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియతో జిల్లాల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి.
పదోన్నతులు పొందిన వారిలో 880 మంది స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ గెజిటెడ్ హెడ్‌మాస్టర్లుగా పదోన్నతులు కల్పించగా, అందులో మల్టీజోన్ 490 మంది, మల్టీజోన్ 390 మంది ప్రమోషన్లు పొందారు. 3,574 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు ప్రమోషన్లు ఇవ్వగా, అందులో 811 మందికి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా, 2,763 మంది ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ పదోన్నతులు ద్వారా మొత్తంగా 4,454 ఖాళీలు తాజాగా ఏర్పడ్డాయి. దీనికి తోడూ గతంలో గుర్తించిన ఖాళీలను కలుపుకుంటే 13 వేలకుపైగా ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం గుర్తించిన ఖాళీల్లో ఎక్కువగా ఎస్జీటీ పోస్టులే ఉన్నాయి.
నోటిఫికేషన్ ఊసెత్తని సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. కానీ, ఏడు నెలలు కావొస్తున్నా ఇంత వరకూ నోటిఫికేషన్‌పై ప్రభుత్వం, అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఉద్యోగార్థులు మాత్రం డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ఏడాదిలో రెండు సార్లు.. జనవరిలో ఒకసారి, జూన్‌లో రెండో సారి నిర్వహించింది.
ఈ రెండింటిలో అర్హత సాధించిన బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎస్జీటీ పోస్టుల కోసం దాదాపు 70వేల మంది, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం 2లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. 2024 హాజరైన అభ్యర్థుల సంఖ్య 2.65 లక్షల వరకు ఉంది. కొత్తగా మరో 5వేల నుంచి 10వేల మంది రాసే వారుంటారు. అంటే మొత్తం 2.50 లక్షల నుంచి 2.75 లక్షల మంది ఉంటారు. గతేడాదిలో డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే 5వేల నుంచి 6వేలకుపైగా టీచర్ పోస్టులను త్వరలోనే ప్రకటిస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. కానీ, ఇంత వరకూ దీనిపై ఊసెత్తడంలేదు.
సరిపడా ఉన్నారంటున్న అధికారులు!
రాష్ట్రంలో దాదాపు 26వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 13వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నట్లు అధికారులు గుర్తించినా కొరత ఎక్కడా లేదని పేర్కొంటున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి కంటే ఎక్కువగానే ఉన్నారని చెబుతున్నారు. టీచర్ల సంఖ్య సరిపడా ఉన్నప్పుడు ఇంకా కొత్తగా టీచర్ పోస్టులను ఎందుకు భర్తీచేయడమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఒక్కరే టీచర్లు ఉన్న పాఠశాలలు 5వేల వరకు ఉండడం గమనార్హం. మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలకు ఎక్కువగా ఉన్న చోటు నుంచి తాత్కాలికంగా జిల్లాల్లో సర్దుబాటు చేస్తున్నారు. పైగా ఈ విద్యాసంవత్సరం నుంచి వెయ్యి పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించారు. ఈ పోస్టులను సైతం ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది.
ఖాళీలను భర్తీ చేయాలి
రాష్ర్టంలో పదోన్నతుల ప్రక్రియ, పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి. అందుకు ఆర్థిక శాఖ వెంటనే అనుమతి ఇవ్వాలి. గత డీఎస్సీ సమయంలోనే మరో 6వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు తగ్గట్టు రెండు సార్లు టెట్ పరీక్ష కూడా పూర్తి చేసింది. వెంటనే జాబ్ క్యాలండర్‌తో పాటు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
దుర్గం హరీశ్, డీఎడ్ బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి