calender_icon.png 12 January, 2026 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంలో భక్తుల రద్దీ

12-01-2026 01:51:06 AM

  1. కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం
  2. హనుమకొండ-మేడారం మార్గంలో ట్రాఫిక్ జామ్ 

మేడారం, జనవరి 11 (విజయక్రాంతి): విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో పాటు శని ఆదివారాలు వరుసగా రెండు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రావడంతో ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున మేడారం తరలి రావడంతో ఆదివారం మేడారం కిక్కిరిసింది. జాతర ముందే మొదలయ్యిందా అన్న తరహాలో భక్త జనంతో గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. శనివారం నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు మేడారం బాట పట్టారు.

ఆదివారం ఉద యం జంపన్న వాగుతో పాటు గద్దెల ప్రాంగణంలో భక్తజనంతో సందడిగా మారింది.  మల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించడంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. అలాగే పసర నుండి మేడారం మార్గంలో పలుమార్లు రాకపోకలకు ఆటంకం కలిగింది. కొత్తూరు, వెంగలాపూర్ మధ్య రోడ్డు నిర్మాణం పనులు నిర్వహిస్తుండడంతో వాహనాలను కన్నేపల్లి మీదుగా జంపన్న వాగు వద్దకు మళ్ళించారు. జంపన్న వాగు పక్కనే వాహనాల పార్కింగ్ చేయించి అక్కడి నుండి భక్తులను గద్దెల ప్రాంగణానికి పంపించారు.

ఇంకోవైపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రావడంతో ఆదివారం గద్దెల పైకి భక్తులను అనుమతించలేదు. కొత్తగా ఏర్పాటుచేసిన రాతి ప్రాకారంలోని ఇత్తడి గ్రిల్ బయట నుండి వనదేవతలను దర్శించుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకోవడానికి ఆదివారం సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు భావిస్తున్నారు.