calender_icon.png 15 July, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లతో నష్టం లేదు

20-06-2025 01:14:37 AM

  1. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేముంది?
  2. ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఉండాలి
  3. రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే నా పాలసీ
  4. పోలవరం ప్రాజెక్టుకు తప్ప ఏ ప్రాజెక్టుకు అనుమతి లేదు
  5. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

అమరావతి, జూన్ 19: సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం సమంజసం కాదని, సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేముందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదన్నారు. ఆ విషయమే కేంద్రం సైతం చెప్పిందన్నారు. తాము ఎవరితో గొడవ పెట్టుకోమని, రాష్ట్రం కోసం ఎంతకైనా పోరాడుతామన్నారు. రెండు నదులకు ఏపీ చివరి రాష్ట్ర మని, లిఫ్ట్‌లు అవసరం లేకుండా నీళ్లు పారుతాయన్నారు.

ఈ పరిస్థితి తెలంగాణకు లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనేదే తన పాలసీ అన్నారు. గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోదావరి నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతిరాని ప్రాజెక్టులేనని చెప్పారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదన్నారు.

తెలంగాణ, ఏపీ అగ్రస్థానంలో ఉండాలని తాను కోరుకుంటానన్నారు. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉందామన్నారు. ఉమ్మడి ఏపీలో దేవాదుల, కల్వకుర్తి తానే నిర్మించానని తెలిపారు. ‘మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా? కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభం లేదు. కొత్త ట్రిబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలి.

ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందాం. ఎవరూ ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణానదిలో మాత్రమే నీళ్లు తక్కువగా ఉన్నాయి. కొత్త ఆథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు.’ అని చంద్రబాబు తెలిపారు.

తెలంగాణపై స్వరం తగ్గించారా..?

తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉన్నట్లు అర్థమవుతోందని, అందుకే తెలంగాణపై సానుకూల దృక్పథంతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని, తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని అంటున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నారు.