calender_icon.png 7 January, 2026 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంకర పోశారు.. కనికరించి రోడ్డు వేయరూ

06-01-2026 12:00:00 AM

  1. రెండేళ్లయినా తీరని రంగాపురం తండా వాసుల బాధలు                                 

ప్రయాణానికి తప్పని ఇక్కట్లు                             

పనులు పూర్తి చేయాలని  వేడుకోలు                  

మోతె, జనవరి 5 : గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యం అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకు గ్రామాల అభివృద్ధికి గాను ఏ ప్రభుత్వాలు అయినా అధిక నిధులు కేటాయిస్తుంటాయి. అందునా రవాణా సౌకర్యానికి అధిక ప్రాముఖ్యతనిస్తాయి. అయితే కొందరి అలసత్వం కారణంగా పలు గ్రామాలకు రోడ్డు మార్గాలు సక్రమంగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిలు నెలకొన్నాయి.

ఇటువంటి పరిస్థితి మండల పరిధిలోని నర్శింహాపురం ఆవాస గ్రామమైన రంగాపురం తండా వాసులది. నర్సింహాపురం నుండి రంగాపురం తండా వరకు రెండు కిలోమీటర్ల దూరం. అయితే తండాకు రోడ్డు మార్గం సక్రమంగా లేని కారణంగా గత బీఆర్‌ఎస్  ప్రభుత్వం హయాంలో ట్రైబల్ వెల్ఫేర్ నిధుల నుండి రూ.2.10 కోట్లతో బిటి రోడ్డును మంజూరి చేసింది.  దీనిని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 30, సెప్టెంబర్ 2023న శంకుస్థాపన చేశారు.

తదుపరి సంవత్సర కాలం గడిచిన తర్వాత కంకరపరిచారు. అనంతరం సంవత్సరం అవుతున్న దాన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. రోడ్డు పనులు ప్రారంభించి రెండేళ్లయినా పనులు పూర్తికాక పోవడంతో తండా వాసులు ఆ రోడ్డులో వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

గత్యంతరం లేక వెళ్లక తప్పడంలేదు. అనేక మందికి గాయాలు : సంవత్సర కాలంగా ఈ రోడ్డులో కంకర పోసి వదిలేయడంతో బైకులు  అదుపుతప్పి కిందపడి గాయాల పాలైన సంఘటన చాలా ఉన్నాయి. అలాగే ఇదే రోడ్డులో ఉన్న వాగుకు గుణాలు వేయడంతో వానాకాలంలో వరద ఎక్కువ వస్తె రోడ్డుపై నుండి నీరు వెళ్లి ప్రయాణానికి ఆటంకం కలుగుతుంది. గతంలో ఉన్న కల్వర్టు కూడా కొంత కుంగిపోవడంతో రాత్రి వేళలో ప్రయాణం చేసే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.         

ఎమ్మెల్యే చొరవతో పనులు ప్రారంభం! 

 ఇదే విషయమును స్థానిక ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకువెళ్లగా స్పందించిన ఆమె పనులు జాప్యం జరగడానికి గల కారణాలు తెలుసుకుని వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. పనులు వెంటనే జరిపించేందుకు ఆర్థిక సహకారం కూడా అందించేందుకు హామీ ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పనులు ప్రారంభం అవుతాయని తండవాసులు ఎదిరిచూస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి తమ ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని రంగాపురం తండావాసులు కోరుతున్నారు.  

రోడ్డుపై వెళ్లాలంటే భయం  కలుగుతుంది 

రోడ్డుకు కంకర పోసి సంవత్సరం కావొస్తుంది. ఇప్పటివరకు ఈ రోడ్డును పట్టించుకునే నాధుడే లేడు. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ అదుపుతప్పి బైకులపై నుండి కిందపడి గాయాలైన వారు ఉన్నారు.  దీంతో ప్రయాణం చేయాలంటేనే భయం కలుగుతుంది. అధికారులు స్పందించి ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయించాలి.  

- వాంకుడోత్ గోదానాయక్, నరసింహపురం గ్రామస్తుడు

అతి త్వరలో పనులు ప్రారంభిస్తాము 

ఆర్థికపరమైన అంశాలతోని పనులు జాప్యం జరిగిన మాట వాస్తవమే, ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో ఎమ్మెల్యే చొరవతో సమస్యలన్నీ తొలగిపోయాయి. దీంతో పనులను వారం పది రోజుల్లో ప్రారంభిస్తాము. అదే సమయంలో కాంట్రాక్టర్ ని కూడా వేగంగా పనులు ప్రారంభించాలని ఆదేశిస్తాం.

- సత్యానందం ఈ ట్రైబల్