calender_icon.png 22 July, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేని భూమి ఉన్నట్టు చూపించి రూ.50 కోట్లకు టోకరా

21-07-2025 01:14:35 AM

మోసపోయిన 60 మంది బాధితులు 

శేరిలింగంపల్లి, జూలై 20: లేని భూమి ఉన్నదని నమ్మించి మోసంచేసి రూ.50 కోట్లకు టోకరా వేశారు. ఈ వ్యవహారంలో ఆదర్శ్ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఓరుగంటి దుర్గా, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సుబ్బారావులపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్నాడు.

2021 ఏప్రిల్‌లో తెలిసిన వ్యక్తి ద్వారా గృహ నిర్మాణ ప్రాజెక్టు కోసం ఓరుగంటి దుర్గా, ఓరుగంటి సుబ్బారావును జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో కలిశారు. తమ సొసైటీ అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతోందని, సొసైటీ సభ్యుడిగా చేరితే గచ్చిబౌలిలోని సర్వే నంబరు 37, 40లోని భూమిలో 500 చదరపు గజా ల స్థలం పొందేందుకు అర్హులవుతారని తెలిపారు. సభ్యత్వం కోసం డిపాజిట్ కింద రూ.కోటి కట్టాలని సూచించారు.

నమ్మిన ప్రవాసుడు డబ్బు కట్టేశాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు దాదాపు 60 మందిని చేర్పించారు. ఆ తర్వాత మరికొందరు చేరేందుకు ప్రయత్నించినా సొసైటీ సభ్యత్వం ముగిసిందని.. దానికి అనుబంధంగా ఉన్న మొబైల్ వెల్ఫేర్ సొసైటీలో చేరాలని చెప్పారు. కొన్నిరోజుల తర్వాత భూమి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి, కోర్టు వివాదాల్లో ఉన్నందున ఆలస్యం జరుగుతోందని నమ్మించారు. బాధితులు 60 మంది ఇలా 2021 నుంచి 2023 వరకు భూమి రిజిస్ట్రేషన్, అభివృద్ధి, కోర్టు ఛార్జీల పేరుతో ఆదర్శ్, మొబైల్ సొసైటీ నిర్వాహకులు ప్రవాసుడి నుంచి మొత్తం రూ.6.46 కోట్లు వసూలు చేశారు.

గడువు దాటినా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో డబ్బు వెనక్కివ్వాలని డిమాండ్ చేశాడు. 2024 జనవరిలో రూ.8 కోట్లకు సంబంధించి 2 చెక్కులను ప్రవాసుడికి ఇవ్వగా బౌన్స్ అయ్యాయి. అనుమానం రావడంతో ఆరా తీయగా మొబైల్ వెల్ఫేర్ సొసైటీకి ఎక్కడా భూమిలేనట్లు తేలిందని, ఆదర్శ్ సొసైటీతో దానికి సంబంధం లేదని, ఓరుగంటి సుబ్బారావు, మొబైల్ వెల్ఫేర్ సొసైటీపై అనేక కేసులున్నట్లు తెలుసుకున్నాడు. మొత్తం 60 మందిని మోసగించి దాదాపు రూ.50 కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.