calender_icon.png 28 January, 2026 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమకొండలో దొంగల హల్చల్

28-01-2026 10:51:36 AM

కామారెడ్డి, జనవరి28(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని పలు గడ్డ ప్రాంతంలో మంగళవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు రుకుంబాయి–కిష్టయ్యల ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. ముగ్గురిలో ఒకరు బయట కాపలా ఉండగా, మరో ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రుకుంబాయి నోరు నొక్కి వెనుక నుంచి దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. అరుపులు విని మంచంపై నుంచి లేచిన భర్త కిష్టయ్యపై మరో దుండగుడు దాడి చేశాడు.

ఇంట్లో కిరాయిగా ఉంటున్న వెంకటమ్మ అరుపులు విని లోనికి రావడానికి ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేశారు. బాధితుల అరుపులకు భయపడి ఇద్దరు దుండగులు బయటికి పరుగులు తీయగా, బయట ఉన్న మరో వ్యక్తితో కలిసి పరారయ్యారు. దుండగులు కొట్టి పారిపోయారని బాధితులు బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానిక యువకులు వెంటనే వారిని వెంబడించారు. దుండగుల్లో ఒకడు కత్తి చూపుతూ భయపెడుతూ పారిపోతూ వినాయక వెంచర్ ప్రాంతంలో గుంతలో పడి చిక్కుకున్నాడు. అతడి వద్ద కత్తి, డమ్మీ తుపాకీని స్థానికులు గుర్తించారు. అనంతరం అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన నిందితుడిని విచారించగా అతడు మాచారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన గోన్నె రజినీకాంత్‌గా గుర్తించబడ్డాడు. తాను ఒక్కడే చోరీకి దిగినట్లు పోలీసుల ఎదుట వెల్లడించినట్లు తెలిపారు. తన వద్ద నుండి డమ్మీ తుపాకీ, హాక్సీ బ్లేడు ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.