calender_icon.png 4 July, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ బడి సూపర్!

04-07-2025 01:11:15 AM

  1. సర్కారు బడికి విద్యార్థుల బాట  ప్రైవేటు బడి వదిలి ప్రభుత్వ పాఠశాలకు..
  2. తాట్యా తండా బడి సక్సెస్ ఫుల్

మహబూబాబాద్, జూలై 3, (విజయ క్రాంతి): ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 20 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూల్ ను వదిలి ప్రభుత్వ బడిలో చేరిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కురవి మండలం తాఠ్య తండా శివారు ఖాసీం తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఈ విద్యా సంవత్సరం ఇద్దరు పిల్లలతో ప్రారంభం కాగా,

అదే ఆవాస ప్రాంతంలో సుమారు 25 మంది బడి ఈడు పిల్లలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విషయం తెలుసుకున్న ఉపాధ్యాయురాలు పోలోజు మంజుల విద్యార్థుల తల్లిదండ్రులకు గత వేసవిలో ఇంటింటికి వెళ్లి నచ్చజెప్పి పాఠశాలకు పంపే విధంగా కృషి చేశారు.

అప్పట్లో అంగీకరించిన తల్లిదండ్రులు తొలుత ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తమ పిల్లలను ప్రైవేటు పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి కొంత సంకోచించినప్పటికీ కొందరు ముందుకు వచ్చి తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించారు. వారం పది రోజులపాటు టీచర్ విద్యా బోధన తీరుపై నమ్మకం కలగడంతో మిగిలిన పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ బడికి పంపించడం ప్రారంభించారు.

గత విద్యా సంవత్సరంలో ఇద్దరు పిల్లలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 23 కు చేరింది. మరో ముగ్గురు విద్యార్థులు కూడా ప్రభుత్వ బడిలో చేర్చడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. గత ఏడాది జూలైలో సీరోల్ ప్రాథమిక పాఠశాల నుండి ఖాసీం తండా పాఠశాలకు ఉపాధ్యాయురాలు మంజుల బదిలీపై వచ్చారు.

అప్పట్లో విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో హెడ్మాస్టర్ కూడా పదవి విరమణ చేయడంతో మంజుల సింగిల్ టీచర్ గా విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే గ్రామంలో ప్రభుత్వం సర్వే విధులు అప్పగించడంతో, అప్పట్లోనే ఇంటింటికి తిరిగిన టీచర్ మంజుల ఒకటి నుండి 5వ తరగతి చదివే విద్యార్థుల వివరాలను నమోదు చేసుకున్నారు.

ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో పలుమార్లు తండాలోని విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపించాలని కోరారు. అయితే ప్రభుత్వ బడికి పంపడానికి ముందుగా కొంత తట పటాయించినా ఉపాధ్యాయురాలి కౌన్సిలింగ్ తో పిల్లల్ని పంపించారు. వారం పది రోజుల పాటు పిల్లల విద్యార్థుల తీరు గమనించి, సంతృప్తి వ్యక్తం చేయడంతో తండాలోని ఇతర పిల్లలు కూడా ప్రైవేటు పాఠశాలను వదిలి ప్రభుత్వ బడిలో చేరారు.

సాయంత్రం ప్రభుత్వ బడి సమయసారిని ప్రకారం కాకుండా 4:30 గంటల వరకు విద్యార్థులను బడిలోనే ఉంచి విద్యాబుద్ధులు నేర్పి తల్లిదండ్రులు వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చే సమయానికి తండాకు తీసుకెళ్లి ఇంటి వద్ద అప్పగించి ఇంటికి వెళ్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగిపోవడంతో మండల విద్యాధికారి బాలాజీ ఖాసీం తండా పాఠశాలకు అదనంగా ఒక ఉపాధ్యాయురాలిని డిప్యూటేషన్ ఇచ్చారు.

ఒకటి నుండి ఐదవ తరగతి వరకు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేస్తున్నారు. గతంలో ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలకు పంపించిన తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అంతకంటే మంచిగా విద్యాభ్యాసం చేస్తున్న తమ పిల్లలను చూసి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రైవేట్ పాఠశాల నుండి కొత్తగా ఖాసీం తండా ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బెంచీలు ఏర్పాటు చేయాల్సింది.