‘ఆ నాలుగు’ వారికే..
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం
- ఏఏ స్థానాలు మహిళలకు అవుతాయో టెన్షన్..టెన్షన్
- జిల్లాలో ప్రారంభమైన ఎన్నికల ఫీవర్
ఖమ్మం, ఏప్రిల్ 17(విజయక్రాంతి): ‘మహిళా రిజర్వేషన్’ అగ్ర నాయకుల్లో టెన్షన్ పుట్టిస్తోంది.. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో తిష్టవేసిన నాయకుల ఫీఠాలు కదిలే పరిస్థితి కనిపిస్తోంది.. ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు, ఇక నుంచి కొన్ని స్థానాలు మహిళాలకు రిజర్వుడు కానున్నాయి. దీంతో ఏ నియోజకవర్గాలు మహిళలకు కేటాయించబడతాయో అనే సందేహాలు అందర్ని కలవరపెడుతుంది.
ఇంతకి ఎన్ని నియోజకవర్గాలు... ఏఏ నియోజకవర్గాలు మహిళలకు కేటాయించబడతాయో ‘విజయక్రాంతి’ అందించే ప్రత్యేక కథనం. దేశంలోని చట్టసభల్లో మహిళా 33శాతం రిజర్వేషన్ కేటాయించాలని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.. ఇప్పటికే అర్డినేన్స్ విడుదల చేసిన కేంద్రప్రభుత్వం గురువారం రాత్రి గెజిట్ విడుదల చేసింది.
రాజముద్ర విడుదల చేసిన అంశంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికి ఉభయ సభల్లో బిల్లు పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే దేశ వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో 33శాతం మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాల్సి వస్తుంది.
ప్రస్తుతం ఒక్కరే మహిళా ఎమ్మెల్యే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం ఉంది. మొత్తం అన్ని స్థానాలు పురుషులకే పరిమితమైయ్యాయి. అయితే ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు పురుషులు, ఒక అసెంబ్లీ స్థానంలో మహిళ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖమ్మం, పాలేరు, మధిర, భధ్రాచలం, పినపాక, ఇల్లందు, వైరా, అశ్వరరావుపేట, కొత్తగూడెం స్థానాల్లో పురుషులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాత్రమే మహిళ గా, అది కూడా రిజర్వేషన్ తో కూడిన స్థానం కాకుండా, ఎస్సీ జనరల్ లో మట్టా రాగమయి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇల్లందు నుంచి మహిళా ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం ఒక ఎంపీ స్థానం రామసహాయం రఘురాంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఖమ్మంలో ఆ నలుగురు మహిళలేనా..?
చట్టసభలో 33శాతం మహిళా రిజర్వేషన్లు చట్టం అమలైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ నాలుగు స్థానాలు మహిళలకే కేటాయించాల్సిన పరిస్థితి అనివార్యం అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మరో నాలుగు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అంటే 14 స్థానాలకు 33శాతం రిజర్వేషన్ ప్రకారం నాలుగు స్థానాలు మహిళలకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది.. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోకజవర్గాలకు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఒక వేళ పాత నియోజకవర్గాల ప్రకారం 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే మూడు స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది.
ఆ స్థానాలు మహిళలకేనా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఎస్టీ, రెండు ఎస్సీ, మూడు జనరల్ స్థానాల ఉన్నాయి. మరో నాలుగు స్థానాలు పెరిగే అవకాశం ఉండటంతో రిజర్వేషన్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ 1, ఎస్సీ 1, రెండు జనరల్ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక అంచనా. దీంతో ఆరు ఎస్టీ, మూడు ఎస్సీ, నాలుగు జనరల్ స్థానాలు అయ్యే అవకాశం ఉంది.
ఇందులో మహిళలకు కేటాయించాల్సి వస్తే రెండు ఎస్టీ, ఒక జనరల్, ఒక ఎస్సీ స్థానాలను రిజర్వుడు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళ ఓటర్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా మహిళలు ఉన్నారు. అలాగే మధిర, వైరా, పినపాక, ఖమ్మం నగరంలో మహిళలు అధికంగా ఉన్నారు. దీంతో పాలేరు, ఖమ్మం, పినపాక నియోజకవర్గాలు కచ్చితంగా మహిళకు రిజర్వుడు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అగ్రనేతల్లో టెన్షన్..టెన్షన్
మహిళా రిజర్వేషన్ అగ్రనేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది.. ఏ నియోజకవర్గం మహిళలకు కేటాయించబడతాయోననే భయం లోలోపల ముఖ్యనాయకత్వాన్ని కలవరపెడుతుందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అయినవారు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నవారిలో కొందరి పీఠాలు కదిలే అవకాశం ఉంది. దీంతో ఏ నియోజకవర్గం మహిళలకు కేటాయిస్తారో..? ఒక వేళ మన నియోజకవర్గం మహిళలకు కేటాయిస్తే మన పరిస్థితి ఏంటని..? నేతల్లో గుబులుపట్టుకున్నట్లు తెలుస్తోంది..
అంతే కాకుండా ప్రజల్లో కూడా మహిళా రిజర్వేషన్ టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న స్థానాల్లో అగ్రనాయకత్వం, ప్రజలు మన సీటు సంగతేంటనే ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తోంది.. మొత్తానికి మహిళా రిజర్వేషన్ అనేక మార్పులకు నాంధి పలికే అవకాశం ఉంది.. దీంతో ఆయా నియోజకవర్గాల ముఖచిత్రాలు మారే అవకాశం ఉంది.. నేతలు, అభ్యర్థులు దారులు చూసుకోవాల్సి రావడం ఖాయం.. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో..?






