20-09-2025 01:10:25 AM
-కాంగ్రెస్ ఆలోచన అద్భుతం.. అమోఘం
- ఇదీ అసలైన మార్పు అంటే..
- ఆర్టీసీ బస్సుల్లో టికెట్ చార్జీల పెంపు దుర్మార్గం
- ‘ఎక్స్’ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.84వేల కోట్లు అయితే.. కేవలం తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికే రూ.35 వేల కోట్లను ప్రస్తుత ప్రభు త్వం ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆయ న స్పందించారు. ‘కాళేశ్వరం పథకంతో 37లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహితేొచేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరు అందిస్తారట.. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 టీఎంసీలు అయితే, ప్రాణహిత చేవెళ్లలో 80 టీఎంసీలు మాత్రమేనట.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదో వంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట.. రూ. 35 వేల కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, అమోఘం’ అని రాసు కొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనమని పేర్కొన్నారు. ఇది కదా అసలైన మార్పు అని ఎద్దేవా చేశారు.
పండుగలొస్తే.. దండుకోవడమేనా?
పండుగలు వస్తే చాలు ఆర్టీసీ బస్సు చార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుం డటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె వెలుగు తో సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కు పిండి చార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల సం ఖ్య పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే పండు గ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజా పీడనే అవుతుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజాపాలన, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అని నిలదీశారు.