13-09-2025 02:10:51 AM
అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నా వినిపించడం లేదా ?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : సిగ్గుందా అనే పదం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు గుర్తుకు రాలేదా..? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టంగా చెబుతున్నా వినిపించడం లేదా ..? అని మండిపడ్డారు.
పెగ్గులు పోసే వారికి రాజ్యసభ అవకాశం ఇచ్చేటప్పుడు సిగ్గు అడ్డు రాలేదా..? అని నిలదీశారు. ప్రభుత్వం కూలిపోతుంది అని కేటీఆర్ ఎలా మాట్లాడారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే కుట్రతోనే ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. ఎవరూ ఏ పార్టీలో చేరలేదని, ఎవరైనా పార్టీ మారితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తాను కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లానని, అప్పుడు పార్టీ మారడానికి గల సందర్భం వేరన్నారు.
తెలంగాణ కోసం వెళితే తాను తప్పు చేసినట్టా..? అని విమర్శించారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల అక్రమార్జన జరిగిందని కవిత చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. కవిత అంశంపై స్పందిస్తే ఒకరి బంఢారం ఒకరు బయటపెట్టుకోవాల్సి వస్తుందనే భయం పట్టుకుందన్నారు.