13-11-2025 11:36:21 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, కాసిపేట మండలాల అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం పెద్దపులి సంచరించడం ఆందోళన రేకెత్తిస్తోంది. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న బుగ్గ గూడెం, కరిశెలఘట్టం, పల్లం కూడా, వరి పేట పరిసరాల్లో పెద్దపులి సంచరించినట్లు తెలిసింది. పెద్దపులి రెండు రోజులుగా ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. పెద్దపులి సంచరిస్తున్న ఈ ప్రాంతాల్లో పత్తి చేలు విపరీతంగా పెరిగి ఉండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
పంట పొలాలు, పత్తి చేలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. వీలైనంతవరకు రాత్రి సమయాల్లో బయటకు వెళ్ళవద్దని, పశువులను అడవుల్లోకి పంపకుండా ఇళ్ల వద్దే కట్టేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను ఆడుకునేందుకు పత్తి చేల వైపు పంపవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సంచరిస్తున్న పెద్దపులిని రెండు నెలలుగా కాసిపేట, ధర్మారావుపేట అడవుల మీదుగా తిర్యాణి వైపు రాకపోకలు సాగిస్తున్న పెద్దపులిగానే అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా బుగ్గ గూడెం, వరి పేట అడవుల్లో మళ్లీ పెద్దపులి సంచారం గుబులు రేపుతుంది.