27-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): ఐ-బొమ్మ వ్బుసైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై వరుసగా కేసులు నమోదు చేయడంతో పాటు, లోతుగా విచారించేందుకు కోర్టు నుంచి అనుమతులు పొందుతున్నారు. తాజాగా రెండో కేసులో రవిని విచారించేందుకు తమకు మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సానుకూలంగా స్పందించింది.
రవిని మరో మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. గతంలో ఐదు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు విచారించినప్పటికీ, రవి నుంచి ఆశించిన సమాచారం రాలేదు. ప్రతి ప్రశ్నకూ “గుర్తులేదు.. మర్చిపోయా” అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించాడని పోలీసులు కోర్టుకు నివేదించారు. సాంకేతిక ఆధారాలతో కూడిన ఈ కేసులో నిజాలు రాబట్టేందుకు మరింత సమయం కావాలని కోరడంతో కోర్టు అంగీకరించింది.
రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటివరకు మొత్తం 5 కేసులు నమోదు చేయగా.. తాజాగా రెండో కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఇదే సమయంలో మిగిలిన మూడు కేసులకు సంబం ధించి పోలీసులు పీటీ వారెంట్ పిటిషన్లను దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఆ మూడు కేసుల్లోనూ రవిని అధికారికంగా అరెస్ట్ చూపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఈసారి ‘స్పెషల్’ ట్రీట్‌మెంట్!
కోర్టు ఆదేశాలతో గురువారం పోలీసులు రవిని చంచల్‌గూడ జైలు నుంచి తమ అదుపులోకి తీసుకోనున్నారు. ఇంతకుముందు ఐదు రోజుల కస్టడీలో రవి ప్రదర్శించిన సహాయ నిరాకరణ ధోరణిని తిప్పికొట్టేందుకు పోలీసులు ఈసారి పక్కా ప్రణాళికతో ఉన్నారు. ‘మర్చిపోయా’ అనే నాటకాలకు ఆస్కారం లేకుండా.. టెక్నికల్ ఎవిడెన్స్ ముందుంచి విచారించనున్నారు. ఐబొమ్మ వెనుక ఉన్న నెట్వర్క్, ఆర్థిక లావాదేవీల గుట్టు విప్పేందుకు ఈ మూడు రోజుల కస్టడీ కీలకం కానుంది.