calender_icon.png 10 May, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృత్యువులో వీడని స్నేహబంధం

10-05-2025 06:11:10 PM

ముగ్గురు మిత్రుల మృతితో బావురుమన్న బావోజి గూడెం

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఓకే గ్రామ శివారులోని వివిధ తండాలకు చెందిన ముగ్గురు యువకుల మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఎక్కడికి వెళ్లినా ముగ్గురు కలిసి వెళ్లడం తరచుగా జరుగుతోంది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించడంతో స్నేహబంధం కాస్త మృత్యు బంధంగా మారింది. చేతి కంద వచ్చిన కొడుకులు అకాల మృత్యువాత పడడంతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బావాజీ గూడెం శివారు తండాలకు చెందిన గుగులోత్ కార్తీక్, భూక్య సంతోష్ ద్విచక్ర వాహనంపై గురువారం 11 గంటల ప్రాంతంలో మరిపెడకు వెళుతుండగా వారి వెనకే మరో ద్విచక్ర వాహనంపై అజ్మీర సుధీర్ వస్తున్నాడు.

ఈ రెండు ద్విచక్ర వాహనాలను అజాగ్రత్తగా, అతివేగంగా నడుపుతుండగా కార్తీక్, సంతోష్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సుదీర్ నడిపిస్తున్న ద్విచక్ర వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో కార్తీక్, సంతోష్ వాహనం పైనుండి రోడ్డుపై ఎగిరిపడి అక్కడికక్కడే మరణించగా, సుధీర్ తీవ్రంగా గాయపడడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు. అజాగ్రత్త, అతివేగం ముగ్గురు మిత్రుల ప్రాణాలను బలిగొంది. ఎదిగిన కొడుకులు అకాల మృత్యువాత పడడంతో తల్లిదండ్రుల రోదనలతో బావోజీ గూడెం బావూరు మంది. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మరిపెడ ఎస్సై సతీష్ తెలిపారు.