18-10-2025 12:36:55 AM
హుజూర్ నగర్,(విజయక్రాంతి): ప్రతి అవకాశాన్ని విజయాలుగా మలుచుకోవడం మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని సూర్యాపేట జిల్లా ఎస్పి కొత్తపల్లి నరసింహ ఐపిఎస్ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 25న హుజూర్ నగర్ పట్టణంలో పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నెషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సభా ప్రాంగణాన్ని పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించి, పలు సూచనలను చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... సింగరేణితో పాటు, రాష్ట్ర డిజిటల్ ఎంప్లాయ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అత్యధిక కంపెనీలు హాజరవుతుండగా, ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు పలు జిల్లాల నుండి 20వేల వరకు అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగమేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులు ఉద్యోగాలు పొందాలన్నారు.ప్రతి అవకాశాన్ని విజయాలుగా మలుచుకోవడం మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు ప్రలోభ పెడితే 100కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు.