18-11-2025 12:00:00 AM
గజ్వెల్, నవంబరు 17: ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు మండలం దాసర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాసర్లపల్లి గ్రామానికి చెందిన మన్నె బిక్షపతి 58 సంవత్సరాలు వ్యవసాయ పనుల నిమిత్తం సోమవారం కొక్కొండ గ్రామానికి తన టీవీఎస్ ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.
మార్గమధ్యలో బస్వాపూర్, కొక్కొండ గ్రామాల రహదారిపై మట్టిలోడుతో వస్తున్న టిప్పర్ బిక్షపతి నడుపుతున్న ద్విచక్ర వాహనానికి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రఘుపతి తెలిపారు. మృతుడికి భార్య అంజమ్మ నలుగురు పిల్లలు ఉన్నారు.