తీరుమారని వంటిమామిడి మార్కెట్
కలగానే మిగిలిన రైతు మార్కెట్ నిర్మాణం
డబ్బులు చెల్లించినా స్వాధీనం కానీ భూమి
ఇంటి స్థలాలు ఇచ్చాకే భూములు ఇస్తామంటున్న రైతులు
ట్రాఫిక్ నియంత్రణకు ముప్పు తిప్పలు పడుతున్న పోలీసులు
గజ్వేల్, మార్చి 6 : వంటిమామిడి మార్కెట్ పరిధిలో రైతు మార్కెట్ ఏర్పాటు ఇంకా కలగానే మిగిలిపోయింది. గత ప్రభు త్వం వంటిమామిడి వద్ద కూరగాయ రైతుల డిమాండ్ ను గుర్తించి రైతులు సొంతంగా తమ పంటలను అమ్ముకునేందుకు రైతు మార్కెట్ ను ఏర్పాటు చేసేందుకు సర్వే నెంబర్ 72 లోని 49.26 ఎకరాల భూమిని సేకరించింది. ఇందుకోసం మార్కెటింగ్ శాఖ రూ. 8.72 కోట్లకు పైగా డబ్బులను సంబంధిత రైతులకు భూసేకరణ కోసం చెల్లించింది.
ప్రభుత్వం భూములు కోల్పోయిన రై తులకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పడంతో రైతులు భూములు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ వెనక సర్వేనెంబర్ 71 లో 21.10 ఎకరాలను ఇంటి స్థలాల కోసం సేకరించగా వారిలో కొందరు రైతులు మాత్రమే పరిహారాన్ని తీసుకున్నారు. ఇండ్ల ప్లాట్లు తమకు అప్పగిస్తేనే మార్కెట్ కేటాయించిన భూమిని ఖాళీ చేస్తామని రైతులు వెల్లడిస్తున్నారు. దీంతో ఐదేళ్లు గడుస్తున్నా రైతు మార్కెట్ నిర్మాణం కలగానే మిగిలిపోయింది.
ట్రాఫిక్ నియంత్రణకు ముప్పు తిప్పలు పడుతున్న పోలీసులు
వేకువ జాము నుండి ఉదయం 11 గంటల వరకు వంటిమామిడి మార్కెట్ కు తమ పంటలను విక్రయించడానికి వచ్చే రైతులు, వ్యాపారులు వాహనాలను రోడ్లపైనే నిలపడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. సంవత్సరాలుగా పోలీసులు రైతుల రద్దీతో ఎలాంటి ప్రమాదాలు జరగవద్దన్న ఉద్దేశంతో నిత్యం ట్రాఫిక్ ను సరి చేస్తూ ఉంటారు.
ప్రతిరోజు 20 మంది పోలీస్ సిబ్బంది తోపాటు సిఐ,ఎస్‌ఐలు కూడా ఐదారు గంటల పాటు వంటిమామిడి మార్కెట్ వద్దనే విధులు నిర్వహించాల్సి వస్తుంది. రెవెన్యూ శాఖ అధికారులు రైతులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తే కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యేలా లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రైతులకు ఇళ్ల స్థలాలు అందజేస్తే రైతులకు ప్రత్యేక మార్కెట్ ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.




