calender_icon.png 18 October, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాది కాదు అంటే.. మాది కాదు

17-10-2025 11:50:10 PM

-జోరుగా అక్రమ నిర్మాణం 

-దాటవేస్తున్న అధికారులు ఇది తేలేది ఎట్లా? 

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 17 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ మండల సరిహద్దు ప్రాంతమైన బస్వతారక కాలనీ పంచాయతీ సమీపంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమ నిర్మాణాల ప్రాంతం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోది కాదని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పంచాయతీల పరిధిలోది కాదని బసవతార కాలనీ, కేశవాపురం పంచాయతీ కార్యదర్శులు సమాధానమివ్వటం గమనార్హం. భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేస్తే వాటిని తిరస్కరించామని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే ఎలాంటి అనుమతులు లేకుండా హెచ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేసి మున్సిపాలిటీ లో సెల్ఫ్ అసెస్ స్మెంట్ ద్వారా నెంబర్ పొంది జోరుగా వ్యాపారం సాగిస్తున్న వైనం విధితమే. అదే ప్రాంతంలో మరో నూతన భవనాన్ని హెచ్ కన్వెన్షన్ హాల్ యజమాని చేపట్టారు. హెచ్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా కేటీపీఎస్ ఉద్యోగి భారీ భవన నిర్మాణాన్ని చేపట్టారు.. అక్రమ నిర్మాణాలను వ్యవహారాన్ని విజయక్రాంతి వెలుగులోకి తెచ్చిన విషయం విధితమే. సదరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శిలు నిర్మాణం జరిగే ప్రాంతాలు తమ పరిధిలోవి కావంటూ సెలవు ఇవ్వడం కోస మెరుపు.

ఆక్రమార్కులు నిర్మాణాలు పూర్తిచేసి దొడ్డిదారిన ఇంటి పన్నులు పొంది అదే హక్కుగా చలామణి అవుతున్న విషయం విధితమే. జిల్లా కేంద్రంలోని ఇలాంటి పరిస్థితి నెలకొంటే మారుమూల గిరిజన మండలాల్లో, పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అసలు నిర్మాణం జరిగే ప్రాంతం పట్టణమా, మండలమా అధికారులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి సంయుక్తంగా అక్రమ నిర్మాణాలపై విచారణలు నిర్వహించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పట్టణ,మండల ప్రజలు కోరుతున్నారు.