27-04-2024 12:05:00 AM
ఇప్పుడున్న బిజీబిజీ జీవితాలలో పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటోంది. ఇక వర్కింగ్ ఉమెన్‌కైతే ఇటు ఇల్లూ, అటు ఉద్యోగమూ రెండూ భారమే కావటం వల్ల మొబైల్ గానీ, ట్యాబ్‌గానీ పిల్లల చేతిలో పెట్టేసి తమ పని తాము చేసుకుంటున్నారు. దీని వల్ల పిల్లల కళ్లు, మానసిక ఆరోగ్యం మీద ప్రభావం పడుతోంది. అయితే అసలు సమస్య ఇది మాత్రమే కాదు. ఇప్పుడు యూట్యూబ్‌లో పిల్లలు చూడకూడని కంటెంట్ కూడా కుప్పలు తెప్పలుగా అందుబాటులో ఉంటోంది. పెద్దవాళ్లు గమనిస్తే పరవాలేదు గానీ, ప్రతీక్షణం వాళ్లనే గమనిస్తూ ఉండటం కూడా సాధ్యం కాని పని. వాళ్లు యూట్యూబ్‌లో ఏం చూస్తున్నారని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండలేం కదా. అలాగని పిల్లలని పూర్తిగా ఇంటర్నెట్‌కి దూరంగా ఉంచటం కూడా సాధ్యం కాదు. మరెలా అనుకుంటున్నారా? పిల్లలమీద చెడు ప్రభావం చూపించే కంటెంట్ కనిపించకుండా సెట్టింగ్స్ మార్చేస్తే సరిపోతుంది. అదెలాగంటే...
1. ఫోన్‌లో యూట్యూబ్ ఓపెన్ చేసి ‘ప్రొఫైల్’ సెలక్ట్ చేసుకోవాలి.
2. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘జనరల్’ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
3. అందులో ‘రిస్ట్రిక్టెడ్ మోడ్’ అనే ఆప్షన్ సెలక్ట్ చేయాలి
ఇప్పుడు పిల్లలు యూట్యూబ్ ఓపెన్ చేసినా వారి వయసుకు మించి చూడకూడని వీడియోలు కనిపించటం ఆగిపోతుంది. ఇదొక్కటే కాదు ప్లేస్టోర్ లోనూ పేరెంటింగ్ యాప్స్ ఉన్నాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే పిల్లలు ఏవైనా అభ్యంతరకరమైన సైట్లు ఓపెన్ చేసినా, వారి వయసువారు చూడకూడని కంటెంట్ ఎక్కువ సేపు ప్లే చేసినా ఆ విషయం తెలుసుకోవచ్చు.