calender_icon.png 25 May, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లైన నాలుగో రోజే జైలుకు!

25-05-2025 12:00:00 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షించిన ఆ యువకుడు చురుగ్గా ఉద్యమంలో పాల్గొన్నాడు మానకొండూర్  నియోజకవర్గం బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్) నాయకులు చింతికింది శ్రీనివాస్ గుప్తా. శ్రీనివాస్ గుప్తా వివాహం వేములవాడలో జరిగింది. అంతకు ముందు నిరాహార దీక్షకు వెళ్తున్న కేసీఆర్‌ను అల్గునూరు వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

అప్పుడు మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకి మండల పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న శ్రీనివాస్ గుప్తా.  కేసీఆర్ దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు వివాహమైన రెండోరోజే మండల పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలతోపాటు టెలికాం కార్యాలయాన్ని ముట్టడించారు.

బెజ్జంకి రాజీవ్ రహదారిపై ఓ ప్రైవేట్ వాహనాన్ని ధ్వంసం చేసిన కేసులో శ్రీనివాస్ గుప్తాతోపాటు మరో తొమ్మిది మంది పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్ జైలుకు తరలించి మూడు రోజులపాటు నిర్బంధించారు. అంతేకాకుండా మండలంలో బంద్, రాస్తారోకోలు, ధర్నాలు మొదలగు నిరసన కార్యక్రమాల్లో ఉద్యమించిన శ్రీనివాస్ గుప్తా మంచి నాయకుడుగా పేరుంది. ప్రస్తుతం శ్రీనివాస్ గుప్తా పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

                                                                                                                                                                                    విజయసింహ రావు బల్మూరి, కరీంనగర్

పోరాటం చేసినా ఫలితం దక్కలేదు!

తెలంగాణ కోసం జైలుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. మాజీ మంత్రి హరీశరావుకు నమ్మకస్తునిగా పనిచేసినా ఎలాంటి పదవి రాలేదు. తెలంగాణ కోసం పోరాటం చేసినందుకు గర్వపడుతున్నా. కానీ పదవి రానందున ఒకింత నిరాశ చెందాను.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. జూన్ రెండున అవతరణ దినోత్సవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. ఉద్యమ హామీలను నేరవేర్చని పక్షంలో ఉద్యమకారులతో కలిసి మళ్లీ ఉద్యమించాల్సి పరిస్థితి వస్తుంది.

 - చింతకింది శ్రీనివాస్ గుప్తా