calender_icon.png 25 May, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ కోసం రోడ్డెక్కని రోజు లేదు!

25-05-2025 12:00:00 AM

‘తెలంగాణ ఉద్యమంలో రోడ్డెక్కని రోజు లేదు. ఏనాడు సమయానికి తిండి తిన్నది లేదు. పేదరికం కారణంగా చదువుకుంటూనే ఆటో నడుపుతూ కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలుస్తున్న రోజులవి. కేసీఆర్ సమావేశాలకు గ్రామం నుంచి ప్రజలను తీసుకెళ్లడంతో తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకున్న. కేసీఆర్ ప్రసంగానికి ఆకర్షితుడనై.. ప్రతి క్షణం తెలంగాణ స్వరాష్ట్రం కోసమే తపించేది. ఆయన ప్రసంగంతో ఉద్యమ బాటలో నడిచా’ అంటున్నారు సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సోసైటీ అర్బన్ మండలం అధ్యక్షుడు తడ్కపల్లి రామారాజు. 

మాది సిద్దిపేట పట్టణానికి కూతవేటు దూరంలోని బూరుగుపల్లి మాదిర రాంచంద్రనగర్ గ్రామం. ఇది సిద్దిపేట మెదక్ ప్రధాన రహదారిపై ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చిన మొదటగా రోడ్డెక్కేది నేనే. నన్ను చూసిన గ్రామ యువకులు నాకు తోడుగా చేరేవారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహానాలు అధికంగా నిలుస్తుండేవి. మాకు కిలోమీటర్ దూరంలోనే సిద్దిపేట రూరల్ పోలీసు స్టేషన్ ఉంటుంది.

రోడ్డుపై నిలిచిన వాహానాలను చూసి నిమిషాల్లో మమ్మల్ని పోలీసు స్టేషన్‌కు తరలించేవారు. ఆ సమయంలో మారెడ్డి రవీందర్ రెడ్డికి, హరీశ్ రావులకు ఫోన్ చేసేవాణ్ణి. వారి సూచనతో కొన్నిసార్లు కేసు నమోదు చేయకుండా వదిలిన సందర్భాలున్నాయి. సిద్దిపేట పాత బస్ స్టాండ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద చెపట్టిన 1,552 రోజుల దీక్షల్లో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో పాల్గొనే వాణ్ణి.

సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోఖో, వంటవార్పు, చలి, వాన, ఎండ అనే తేడానే తెలిసేది కాదు. పోలీసులు అక్రమంగా నిర్బంధించడం, ముందస్తు అరెస్టుల నుంచి తప్పించుకుని ఉద్యమంలో పాల్గొనేది. ఉద్యమంలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తిన్న. సిద్దిపేట రూరల్ మండలంలోని ప్రతి గ్రామంలో యువకులను కూడగట్టి తల రూపాయి పోగు చేసి హరీశన్న గెలుపుకు కృషి చేశా.

అదే స్ఫూర్తితో స్వరాష్ట్రం సిద్ధించింది. ఏనాడు పదవులు ఆశించలేదు. ఆటో కార్మికుడిగా ఉన్న నేను తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. సిద్దిపేట ఆటో కార్మికుల కోసం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తన సొంత నిధులతో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సోసైటీ ఏర్పాటు చేయడం ఆటో కార్మికుల అదృష్టం. ఆ సోసైటీలో సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షునిగా కొనసాగుతున్నా. ఉద్యమకారులను గుర్తించి తగిన గుర్తింపు ఇస్తే మంచిదని నా అభిప్రాయం. 

మంద జనార్దన్, సిద్దిపేట