calender_icon.png 12 September, 2024 | 11:24 PM

మేడారంలో టోర్నడో?

05-09-2024 01:06:51 AM

సుడిగాలి బీభత్సంలో నేలవాలిన 50 వేల చెట్లు 

2౦౦ హెక్టార్ల విస్తీర్ణంలో దెబ్బతిన్న అడవి.. ఆగస్టు ౩౧న ఘటన

విచారణ చేపట్టిన అటవీశాఖ 

హనుమకొండ, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): పచ్చని చెట్లతో కలకలలాడే మేడారం అడవి తల్లి తల్లడిల్లింది. సుడిగాలుల బీభత్సానికి చెట్లన్నీ చెల్లా చెదురయ్యాయి. వేలమంది ఒక్కసారిగా అడవిపై దాడి చేసి చెట్లను నరికి నేలవాల్చినట్టుగా ఉంది అక్కడి పరిస్థితి. ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సుమారు 50 వేలకు పైగా పచ్చని చెట్లు నేలకూలాయి. ఆ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు సైతం విరిగిపడ్డాయి. ఈ మాదిరిగా ఉన్న అడవిని చూసి అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. గతంలో ఎన్నడూ చూడని దృశ్యాలను చూసి షాక్‌కు గురయ్యారు. అక్కడ జరిగిన భారీ విధ్వంసానికి పశ్చిమ దేశాల్లో కనిపించే టోర్నడో తరహా గాలులు కారణమై ఉంటాయని పర్యావరణ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

అడవిలో ఏం జరిగింది?

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో ఆగస్టు ౩౧న సాయం త్రం ౬ నుంచి ౭ గంటల మధ్య భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో సుమారు 200 హెక్టార్లలో విస్తరించిన అడవిలో 50 వేలకు పైగా చెట్లు నేలవాలాయి. ఈ నెల 1న అక్కడికి పరిశీలనకు వెళ్లిన అధికారులు జరిగిన విధ్వంసం చూసి అశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అంతేగాకుండా అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలిదుమారం, సుడిగాలులు సైతం వీచాయి. టోర్నడో లాంటి సుడిగాలులు వీచిన కారణంగా అడవిలోని సుమారు 50 వేలకు పైగా వృక్షాలు నేటమట్టం అయినట్టు అధికారులు భావిస్తున్నారు.

అది కూడా చెట్లను ఎవరో కావాలని నరికి ఒక వరుసలా పేర్చినట్టు ఒకవైపే పడిపోయి ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ దృశ్యాలను బట్టి చూస్తే గంటకు 120 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగానే భారీ వృక్షాలు సైతం నేలకొరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. మంత్రి సీతక్క ఆదేశాల నేపథ్యంలో డీఎఫ్‌వో రాహుల్ జావేద్ తన బృందంతో ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో కలిసి పరిశీలన జరుపుతున్నట్లు చెబుతున్నారు.

సమ్మక్క సారాలమ్మలే కాపాడారు : మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్‌౪(విజయ క్రాంతి): ములుగు అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో వృక్షాలు నేలకూలడం పై మంత్రి సీతక్క విస్మయం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించినప్పటికీ.. ఈ స్థాయిలో కూలిపోయా యని ఊహించలేదని చెప్పారు. జరిగిన నష్టాన్ని డ్రోన్ కెమెరాల సహా యంతో అంచనా వేసే క్రమంలో ఈ విధ్వంసం బయటపడిందని పేర్కొన్నారు. ఘటనపై బుధవారం సచివా లయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్‌వో, స్థానిక అధికారులతో మంత్రి టెలిఫోన్‌లో మాట్లాడారు. 500 ఎకరాల్లో అటవీ సంపద నేల కూలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వేల సంఖ్యలో భారీ వృక్షాలు నేల కూలడంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఘటన ప్రాంతాన్ని సందర్శించి పీసీసీఎఫ్ నివేదిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. సమ్మక్క సారాలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదని, అందేకే ప్రజలు సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. చెట్లు నేలకూలడంపై కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపి పరిశోధన జరిపించాలని, కారణాలు గుర్తించేలా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలన్నారు. అటవీ ప్రాంతంలో చెట్లు కూలిన చోట.. తిరిగి చెట్లు పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.