02-01-2026 01:35:55 AM
నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (విజయక్రాంతి):ట్రాఫిక్ రద్దీతో సతమతమ య్యే చిక్కడపల్లి, అశోక్ నగర్ వాసులకు ఊరటనిస్తూ.. అశోక్ నగర్, దోమలగూడ హుస్సేన్ సాగర్ నాలాపై నిర్మించిన లింక్ బ్రిడ్జిని శుక్రవారం అధికారికంగా ప్రారంభించనున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్, డిప్యూటీ మేయర్లతో కలిసి ఈ వంతెనను జాతికి అంకితం చేయనున్నారు.
2023లో రూ.6 కోట్ల వ్య యంతో ప్రారంభమైన ఈ బ్రిడ్జి పనులు శరవేగంగా పూర్తయ్యాయి. హుస్సేన్ సాగర్ నాలాపై నిర్మించిన ఈ వంతెన వల్ల.. చిక్కడపల్లి సుధా హోటల్ నుంచి త్యాగరాయ గాన సభ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనదారులు సులభంగా లిబర్టీకి చేరుకోవచ్చు. అలాగే దోమలగూడ సూరజ్ గర్ కాలనీ నుంచి గగన్ మహల్ మీదుగా నేరుగా జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వెళ్లేందుకు ఈ మార్గం అత్యంత కీలకం కానుంది.
నగర ప్రజలకు తీరనున్న కష్టాలు
చిక్కడపల్లి నుంచి లిబర్టీకి వెళ్లాలంటే ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇరుక్కుని చాలా సమయం వృథా అయ్యేది. కానీ, ఈ కొత్త లింక్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఆ కష్టాలు తీరనున్నాయి. చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్, దోమలగూడ మీదుగా నేరుగా లిబర్టీలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు ప్రయాణం సుగమం కానుం ది. 2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ మార్గంలో ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.
కేవలం పది నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్ ఏఈ ప్రశాంత్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజల రవా ణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వంతెనను అత్యాధునికంగా తీర్చిదిద్దామని, కొత్త ఏడాదిలో ప్రారంభం కాబోతున్న తొలి బ్రిడ్జి ఇదేనని తెలిపారు.