calender_icon.png 20 September, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ రోడ్డుపై ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం

20-09-2025 12:00:00 AM

  1. ప్రమాదకరంగా ఆళ్లపల్లి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి                                             
  2. ఏడాదిలో అనేక రోడ్డు ప్రమాదాలు
  3. డబుల్ రోడ్డు మంజూరు చేయాలని మండల ప్రజల విజ్ఞప్తి

ఆళ్ళపల్లి, సెప్టెంబర్19 (విజయక్రాంతి) ః ఆళ్లపల్లి నుండి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది. నిత్యం అనేక వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే రహదారి ప్రమాదాలు కారణ భూతంగా మారింది. గతేడాది కురిసిన భారీ వర్షాలకు కిన్నెరసాని వరద ప్రవాహానికి రోడ్లు కోటుకుపోగా  నిత్యం తిరుగుతున్న వారి వాహనాల కారణంగా రహ దారి పూర్తిగా ధ్వంసమై ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.

ఆళ్ళపల్లి మండల పరిధిలోని మర్కోడు, అనంతోగు, రాయపాడు, పాతూరు, రామంజిగూడెం, నడింగూడెం, అడవిరామారం, దొంగతోగు, రాగాపురం పంచాయతిపరిదిలోని సుమారు 30 గ్రామాల ప్రజలు, గుండాల మండలం నుండి 30 గ్రామాల ప్రజలు అనేక అవసరాలకు జిల్లా కేంద్రానికి నిత్యం ఈ రహదారి గుండానే ప్రయాణించాల్సిన పరిస్తితి. అసలే సింగిల్ రోడ్డు అది కూడ గుంతల మయంగా కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇక ఆటోల్లో ప్రయాణించే వారి కష్టాలు వర్ణనాతీతం. ఈ రహదారిపై ప్రయా ణిం చే క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు సంభవించి కొందరు మృత్యువాత పడగా, కొందరు గాయాలపాలయ్యారు. ఇదే రహదారి గుండా ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు ప్రమాదాల బారిన పడ్డాయి.  ఆళ్ళపల్లి నుండి అనిశెట్టి పల్లి 35 కిలో మీటర్ల దూరం, అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు క్షతగాత్రులు వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే సుమారు రెండుగంటల సమయం పడుతుండ టంతో కొందరు సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకోలేక మార్గమధ్యంలోనే ప్రాణా లు విడిచిన సందర్భాలున్నాయి.

ప్రమాదకరంగా ఉన్న రహదారిని అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని , ఓ వైపు ప్రమాదాల జరుగుతున్న అధికారులు,  చూసీచూడనట్లు వ్యవహరించడం పై మండల ప్రజల నుండి  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి డబల్ రోడ్డు మంజూరు చేసి ప్రమాదాల బారి నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.