calender_icon.png 18 August, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డును కమ్మేసిన వృక్షాలు

18-08-2025 01:45:13 AM

రాకపోకలకు ఆటంకాలు

మరిపెడ, ఆగస్టు 17 (విజయ క్రాంతి): మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో మెరుగైన రహదారి నిర్మాణం జరిగినప్పటికీ, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లతో రహదారి మూసుకుపోయి రాకపోకలకు ఆటంకంగా మారింది.

దీనితో తరచుగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ నుంచి గిరిపురం తండా వరకు నిర్మించిన ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన రోడ్డుపై ప్రమాదాలు చోటుచేసుకుని గాయాల పాలవుతున్న ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. కోటి 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రహదారిపై మరిపెడ మండలం భావోజిగూడెం, చిల్లంచర్ల, రాంపురం, ఆనేపురం, ఎలమంచిలి తండా, రేఖ తండా, రూపు సింగ్ తండా, తాళ్లవుకల్ గ్రామాల ప్రజలు నిత్యం మరిపెడ నేషనల్ హైవేకు నిత్యం రాకపోకలు కొనసాగిస్తారు.

ఈ లింకు రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటే రోడ్డుకు ఇరువైపులా కమ్మేసిన చెట్లతో ప్రయాణికులు ఏ వైపున ఈ ముప్పు వచ్చి పడుతుందోనన్న దిగులుతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. గత కొంతకాలం క్రితం ఆ రోడ్డు గుండా ప్రయాణిస్తున్న గిరిపురం గ్రామపంచాయతీ అంగన్వా డీ టీచర్ ఉమ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో గాయాల పాలైన ఆమె కోలుకోవడానికి సుమారు 50 వేల రూపాయలు హాస్పిటల్ ఖర్చు అయిందని ఆ విధంగా వ్యక్తం చేశారు.

రోడ్డుకు ఇరువైపులా, మలుపుల వద్ద ముళ్ళ పొదలు పెరగడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చేంతవరకు కనిపించకపోవడంతో ప్రమాదాలకు హేతువుగా మారింది. రోడ్డుకు  ఇరువైపులా పెరిగిన ముళ్ళ పొదలను తొలగించకపోవడం వల్ల రాత్రిపూట ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది.

ప్రత్యేక రోడ్డు వెంట పెరిగిన పొదలను తొలగించడానికి ‘జంగిల్ కటింగ్’ చేపట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి రోడ్డును కమ్మేసిన చెట్లను తొలగించి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

దగ్గరికి వచ్చేంతవరకు వాహనాలు కనిపించడం లేదు

రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పొదలు, చెట్ల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చేంత వరకు కనిపించడం లేదు. తీరా దగ్గరికి రాగానే వాహనాన్ని అదుపు చేయలేక ప్రమాదాల పాలవుతున్నాము. రోడ్డుపై పెరిగిన పొదలు, చెట్లతో ఇరుకుగా మారింది.

ఈ విషయాన్ని పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాహనాన్ని నడపాల్సి వస్తోంది. అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్ళ పొదలు, చెట్లను తొలగించి రహదారిని మెరుగుపరచాలి. 

 బూఖ్య వెంకన్న, ఆటో డ్రైవర్, గిరిపురం