20-07-2025 12:00:00 AM
పాకిస్థాన్‌కు పరాభవం ఎదురైంది. అదీ తనకు అండగా వుంటున్నదనుకొన్న అమెరికా చేతిలో ఈ పరాభవాన్ని చవిచూడ టం సిగ్గుపడాల్సిన విషయమే. పహల్గాంలో అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్న ఉగ్రసంస్థ ‘ది రెసిస్టాంట్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)ను విదేశీ ఉగ్రసంస్థగా అమెరికా గుర్తించినట్లు ప్రకటించడం పాకిస్థాన్‌కు పెద్ద చెంపపెట్టు. టీఆర్‌ఎఫ్ అంతర్జాతీయ ఉగ్రసంస్థ అని అమెరికా ఈ ప్రకటనతో ముద్రవేసినట్లయింది.
పహల్గాం ఉగ్రదాడితో లష్కరే తాయిదా (ఎల్‌ఈటీ)కి సంబంధముందని, తన పేరు బయటికి రాకుండా టీఆర్‌ఎఫ్‌తో భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు లష్కరే తోడ్పాటునందిస్తున్నదని భారత్ గతంలో పలుమార్లు ప్రకటించింది. పాకిస్థాన్ అండదండలతో భారత్‌లో ముంబై దాడులు మొదలుకొని పలు ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లష్కరే ముసుగును అమెరికా కూడా తొలగించింది.
లష్కరే కార్యకలాపాలు తమ భూభాగం నుంచి జరగడం లేదని బుకాయిస్తూ వచ్చిన పాకిస్థాన్, పహల్గాం దాడి తర్వాత టీఆర్‌ఎఫ్ అంటూ ఒక ఉగ్రసంస్థ ఉన్నట్టు గానీ, అది భారత్‌లో ఉగ్రచర్యలకు పాల్పడుతున్నట్టు గానీ తనకు తెలియదని ప్రకటించిన పాకిస్థాన్ గొంతులో ఇప్పుడు పచ్చివెలక్కాయ పడిన ట్టయింది. టీఆర్‌ఎఫ్ ఒక్కటే కాదు, కాశ్మీర్ రెసిస్టాన్స్ ఫ్రంట్, కాశ్మీర్ రెసిస్టాంట్ సంస్థలు కూడా లష్కరే బినామీలేనని అమెరికా విదేశాంగ మంత్రి మర్కొ రుబియో తేల్చిచెప్పారు.
కొత్త కొత్త పేర్లతో నిషిద్ధ లష్కరే సంస్థ ఎప్పటికప్పుడు కొత్త రూపాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నదని భారత్ చేస్తున్న ప్రకటనలు అక్షర సత్యాలయ్యాయి. దీనితో టీఆర్‌ఎఫ్‌ను నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని కోరుతున్న భారత్‌కు బలాన్నిచ్చినట్టయింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ సమస్యపై చర్చ జరగాలని పట్టుబడుతున్న పాకిస్థాన్‌కు టీఆర్‌ఎఫ్ ఉగ్రసంస్థే అని అమెరికా ప్రకటించడం కొత్త తలనొప్పిని తెచ్చినట్లయింది.
ఉగ్రవాద నిర్మూలనకు భారత్, అమెరికా మధ్య సహకారానికి, టీఆర్‌ఎఫ్‌పై అమెరికా చేసిన ప్రకటన ముందడుగుగానే భావించాలి. పహల్గాం ఉగ్రదాడి కంటే ముందే పాకిస్థాన్ మద్దతుతోనే టీఆర్‌ఎఫ్ పని చేస్తున్నదని ఐక్యరాజ్య సమితికి భారత్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అంది స్తూనే వుంది. లష్కరే, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలను అంతర్జాతీయంగా నిషేధించినట్లుగా, టీఆర్‌ఎఫ్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్న ది.
పహల్గాం దాడి మా పనేనని టీఆర్‌ఎఫ్ పలుమార్లు బాహాటంగా ప్రకటించుకొన్న విషయాన్ని ఈ సందర్భంగా భారత్, ప్రపంచ దేశాల దృష్టికి తెచ్చింది. భారత్ భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు ట్రంప్ ప్రభు త్వం కట్టుబాటు ఈ చర్యతో తేటతెల్లమవుతున్నదని భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటన, ఉగ్రవాద నిర్మూలనకు భారత్- అమెరికా మధ్య కొనసాగుతున్న సహకారానికి ఉదాహరణగా చెప్పవచ్చు.
మరోవైపు, నిషేధిత జైషే మొహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజార్ తన అడ్డాను బహవల్యూరు నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్తాన్‌కు మార్చాడని వస్తున్న వార్తలు ఆందోళన కలిగించేలా వున్నాయి. అజార్ ఎక్కడున్నాడో, ఆ ఉగ్రవాదిని భారత్‌కు అప్పగించడం ఎలాగో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు తెలియదని అనుకోలేం.