22-09-2025 12:00:00 AM
-త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల వెల్లడి
నంగునూరు, సెప్టెంబర్ 20: సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ దేశానికే తలమానికంగా నిలుస్తుందని వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి శనివారం ఆయన ఫ్యాక్టరీని సందర్శించి, ట్రయల్ రన్ ద్వారా జరుగుతున్న ముడి పామాయిల్ ఉత్పత్తిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి మధ్యలో సిద్దిపేట ఉండటం వల్ల రాష్ట్రంలోని ఏ మూల నుంచైనా రైతులు తమ పంటను సులభంగా ఫ్యాక్టరీకి తీసుకురావచ్చని తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో నూనె తీయగా మిగిలిన పిప్పి నుంచి 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ఆయన అన్నారు. నర్మెటలోని ఈ ఫ్యాక్టరీ తెలంగాణ రైతులకే కాకుండా దేశంలోని రైతులకు కూడా మార్గదర్శకంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుంటే, అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 10 లక్షల ఎకరాలు సాగవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ గెలలు అమ్మిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫ్యాక్టరీని ప్రారంభించి, లక్ష మంది ఆయిల్ ఫామ్ రైతులతో ఒక భారీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హేమావతి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు, ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆయిల్ ఫెడ్ ఎండీ శంకరయ్య, జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ పాల్గొన్నారు.