28-11-2025 09:47:30 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): సమాజ సంస్కరణలకు మార్గదర్శకుడిగా నిలిచిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతి సందర్భంగా సంగారెడ‍్డిలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. నేటివ్ ఇండియన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్తలు, యువజన సంఘాల నాయకులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేటివ్ ఇండియన్స్ ఫోరం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బత్తుల విక్రమ్ మాట్లాడుతూ... ఫూలే పోరాటం ఒక యుగానికే పరిమితం కాదు. నేటికీ సామాజిక న్యాయానికి దీప్తిగా నిలుస్తున్నారు.
మహిళా సాధికారత, విద్యా హక్కులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం మా ఉద్యమాలకు శాశ్వత ప్రేరణ అని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి టౌన్ అధ్యక్షుడు ఎస్ఆర్ ప్రమోద్ కుమార్, సంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ బేగరి పురుషోత్తం, మాజీ ఎంపీటీసీ కంది నందకిషోర్, రచయిత, ప్రజా గాయకుడు డప్పోల్ల రమేష్ హాజరయ్యారు. ఫూలే సమానత్వ సిద్ధాంతాలు సమాజంలోని అసమానతలను నిర్మూలించేందుకు మార్గదర్శకంగా నిలిచాయని వారు అభిప్రాయపడ్డారు.