05-07-2025 12:39:50 AM
బాసర, మహబూబ్‌నగర్‌లో ఆగస్టు 4 నుంచి అడ్మిషన్లు
నిర్మల్, జూలై 4 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర, మహబూబ్‌నగర్ త్రిబుల్ ఐటీ లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ జాబితాను శుక్రవారం సాయంత్రం బాసర త్రిబుల్ ఐటీ వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్ విడుదల చేశారు. 2025 విద్యా సంవత్సరానికి గాను బాసరలో 1,600 మంది, మహబూబ్‌నగర్‌లో 190 మంది సీట్లకు 2,258 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన తెలిపారు.
తెలంగాణలోని 33 జిల్లాల్లో పదవ తరగతి మెరిట్ ఆధారంగా త్రిబుల్ ఐటీలో రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. మెరిట్ జాబితాలో 72 శాతం బాలికలు ఉండగా 28 శాతం బాలురు ఉన్నట్టు తెలిపారు. ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు 12 శాతం సీట్లు కేటాయించగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 88 శాతం సీట్లు కేటాయించామని చెప్పారు.
అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 297 మంది విద్యార్థులకు అవకాశం దక్కగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఒక్క సీటు మాత్రమే లభించినట్టు వివరించారు. మెరిట్ జాబితాలో సీట్లు సాధించిన వారు ఈ నెల 7 నుంచి 9 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు 4 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. సమావేశంలో కళాశాల నిర్వాహకులు మురళీధర్, చంద్రశేఖర్, విఠల్ పాల్గొన్నారు.