calender_icon.png 12 January, 2026 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లులకు రాని ధాన్యానికి ట్రక్ షీట్లు?

12-01-2026 01:54:54 AM

ధాన్యం అక్రమాల్లో కొందరిపైనే కేసులు

మిల్లర్లను వదలడంలో ఆంతర్యమేమిటో! 

‘వైకుంఠ’లీలలకు వంతపాడుతున్న 

మంచిర్యాల జిల్లా అధికారులు

మంచిర్యాల, జనవరి 11 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ధాన్యం సేకరణలో జరుగుతున్న అవకతవకలపై నాలుగైదు నెలల నుం చి జిల్లాలో ఏదో ఒక చోట విచారణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక్కో కొనుగో లు కేంద్రంలో ఒక్కోలా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆమ్యామ్యాలు ముట్టిన కాడ ఒక లెక్క, ముట్టని చోట మరో లెక్కలా చూ స్తుండటంతో కొందరికి న్యాయం, మరి కొం దరికి అన్యాయం జరుగుతుందని పలువురు మిల్లర్లు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. సివిల్ సప్లయ్ అధికారుల వ్యవహా రం ఆది నుంచి గందరగోళంగానే ఉంది. మరోవైపు మిల్లర్ల వేషాలు భయటపడకుం డా ఉండేందుకు అధికారులకు సైతం లక్షలు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు సైతం ఒక వైపు వినిపిస్తున్నాయి.

కొందరిపైనే కేసులు

జైపూర్ మండలం నర్సింగాపూర్ కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకలపై నిర్వాహకులతో పాటు ఇందారంలోని రైస్ మిల్లుపై సైతం కేసులు నమోదు చేసిన అధికారులు ఇటీవల కిష్టాపూర్ కొనుగోలు కేం ద్రంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసినా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు కేవలం కొందరిపై ఫిర్యాదు చేసి చేతు లు దులుపుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిష్టాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి గత రబీ సీజన్‌లో 5,600 క్వింటాళ్ల సన్నాలు, 8,700 క్వింటాళ్ల దొడ్డు రకం వడ్లకు సంబంధించి రూ.3.28 కోట్లలో జరిగిన వ్యాపారంలో లక్షల్లో అవకతవకలు జరిగాయని, దానికి సంబంధించి ఏడుగురిపై అధికారులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ తతంగంలో పదుల సంఖ్య లో బాధ్యులున్నారని, కేవలం కొందరిపైనే కేసులు నమోదు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కేంద్రం నుంచి ఏ మిల్లుకు ఎంత ధాన్యం వెళ్లిందో, అసలు ఆ ధాన్యం వెళ్లిందా లేదా అనేదానిపై విచారణ కొనసాగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మిల్లులకు రాకున్నా ట్రక్ షీట్లు

కొనుగోలు కేంద్రాల నుంచి అసలు ధాన్యం మిల్లులకు వెళ్లడం లేదనే ఆరోపణ లు వ్యక్తమవుతున్నాయి. కిష్టాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి జిల్లాలోని జయలక్ష్మీ ఇండస్ట్రీస్ ఇందారం, అష్టలక్ష్మీ అగ్రో ఇండస్ట్రీస్ టేకుమట్ల, సమత ఆగ్రో ఇండస్ట్రీస్ అంకుశాపూర్ భీమారం, శ్రీ రాజరాజేశ్వరి రైస్ మిల్ మద్దులపల్లి జైపూర్, శ్రీ సత్యనారాయణ స్వామి ఆగ్రో ఇండస్ట్రీస్ కుందారం, జైపూర్, సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ రామారావుపేట జైపూర్ మిల్లులతో పాటు కరీంనగర్ జిల్లాలోని శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీస్ పీబీఆర్‌ఎం మోలాన్గూర్, శ్రీ రాజరాజేశ్వర పీబీఆర్‌ఎస్ తాడికల్, శ్రీ వెంకటేశ్వర ఎంఆర్‌ఎం కేశవపట్నం, పెద్దపల్లి జిల్లా శ్రీ శ్రీనివాస ఎంఆ ర్‌ఎం పూసల మిల్లులకు ధాన్యం అధికారికంగా వెళ్లినట్లు ట్రక్ షీట్లున్నాయి. అన్ని మి ల్లులకు ధాన్యం వెళ్లిందా లేదా కేవలం ట్రక్ షీట్లు మాత్రమే వెళ్లాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లర్లను వదల డంలో ఆంతర్యమేమిటని పలువురు మిల్లర్లే ప్రశ్నించడం అనుమానాలకు తావిస్తుంది.

అసోసియేషన్ నాయకుల చేతుల్లో అధికారులు

జిల్లాలో రైస్ మిల్ అసోసియేషన్ నాయకుల చేతుల్లో అధికారులున్నారనే ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శే ప్రధానంగా వ్యవహరిస్తున్నాడని, ఆయన చెప్పినట్లే సివిల్ సప్లయ్ అధికారులు నడుస్తున్నారని తోటి మిల్లర్లే పేర్కొంటున్నారు. ‘వైకుంఠ’ లీలలే నడుస్తున్నాయని, ఆయన చెప్పిన వారికే మిల్ లో ధాన్యం దిగుతుందని, దానికి ఎలా చేయాలి, ఏం చేయాలో ఆయన సలహాల మేరకే నడిపిస్తుండని తెలుస్తోంది. ఆయన సలహాలతోనే కిష్టాపూర్ కేసులో మిల్లు యాజమానులను వదిలేసి అధికారులు కేసులు పెట్టారని, అందుకే వారిని వదిలేసినట్లు ఆరోపణలు. ఈ కేంద్రం నుంచి ఆయన మిల్లుకు సైతం వెళ్లినట్లు తెలుస్తోంది. అసలు ధాన్యం ఆయన మిల్లుకు వెళ్లాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.