calender_icon.png 10 January, 2026 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ గురి

08-01-2026 12:43:09 AM

  1. పావులు కదుపుతున్న అమెరికా అధ్యక్షుడు
  2. వ్యతిరేకిస్తున్న ఐరోపా దేశాలు

వాషింగ్టన్, జనవరి 7 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్ను గ్రీన్‌ల్యాండ్‌పై పడింది. ఎలాగైనా గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు అవసరమైన ఎంపికలపై అధ్యక్షుడు ట్రంప్, ఆయన బృందం రంగంలోకి దిగింది. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన ఎంపికలపై చర్చిస్తోందని వైట్‌హౌస్ మంగళవారం ప్రకటించింది.

వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్భంధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా గ్రీన్‌ల్యాండ్‌ను తమ నియంత్రణలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని, అది తమ జాతీయ భద్రతకు అవసరమని వైట్‌హౌస్ పేర్కొంది. దానిని స్వాధీనం చేసుకునేందుకు తమ వద్ద చాలా వ్యూహాలు ఉన్నాయని, వాటిల్లో సైన్యాన్ని వాడే విషయం కూడా పరిశీలనలో ఉందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం చేసుకునే మార్గాల గురించి ఓవల్ కార్యాలయంలో చర్చలు కొనసాగుతున్నాయని, సలహాదారులు వివిధ మార్గాలపై చర్చిస్తున్నారన్నారు.

కాగా గ్రీన్‌ల్యాండ్‌కు మద్దతుగా నాటో నేతలు చేసిన ప్రకటనలపై ట్రంప్ భయపడటం లేదని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా కోనుగోలు చేయడం లేదా ఆ భూభాగంతో స్వేచ్ఛా అనుబంధ ఒప్పందం (సీఓఎఫ్‌ఎ) ఏర్పరుచుకోవడం కూడా ఉందని పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ఒక అధికారి తెలిపారు. సీఓఎఫ్‌ఐ ఒప్పందం గ్రీన్ల్యాండ్ను అమెరికాలో భాగం చేయాలనే ట్రంప్ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని అన్నారు.

వెనిజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన అనంతరం గ్రీన్‌ల్యాండ్‌పై సుమారు రెండు నెలల్లో నిర్ణయం ప్రకటిస్తానని ట్రంప్ ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి గ్రీన్‌ల్యాండ్ పేరు వార్తల్లో వినిపిస్తోంది. రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ పదేపదే గ్రీన్‌ల్యాండ్ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ విషయంలో మరింత వేగంగా తన వ్యూహాలను అమలు చేస్తున్నారు.