calender_icon.png 6 May, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన సినిమాపె ట్రంప్ దెబ్బ నూరుశాతం!

06-05-2025 12:54:52 AM

అమెరికా వెలుపల నిర్మించే అన్ని చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుందంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 

భారతీయ సినిమాలకు యూఎస్‌ఏ మార్కెట్ కీలకం..

చైనా సినిమాలను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ట్రంప్ తీసుకున్న నూరు శాతం పన్ను నిర్ణయం.. భారతీయ సినిమాపైనా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ సుంకాలు ఓ వినాశకరమైన చర్చ అని, మన సినిమాలపై టారిఫ్‌లు వసూలు చేస్తే భారత సినీరంగం ఆర్థికంగా కుదేలవుతుందని బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పోస్ట్ చేశారు. మన సినిమాలకు యూఎస్‌ఏ మార్కెట్ చాలా కీలకం. మరీ ముఖ్యంగా తెలుగు, హిందీ సినిమాల ఓవర్ సీస్ మార్కెట్‌కు ఆయువు పట్టు లాంటిది.

‘పఠాన్’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘డుంకీ’, ‘జవాన్’ వంటి భారతీయ సినిమాలు అమెరికాలో కలెక్షన్ల రికార్డులు బద్దలుకొట్టాయి. 2023 సంవత్సరంలో భారతీయ సినిమాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద 20 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.168 కోట్లు)కు పైగా వసూళ్లు సాధించాయి. కొన్ని సినిమాలు వెయ్యిపైగా స్క్రీన్లలో ప్రదర్శితమయ్యాయి.

తెలుగు చిత్రాలు నార్త్ అమెరికాలో మిలియన్ డాలర్ల వసూళ్లు రాబడుతుంటాయి. మన సినిమాలు సగటున మిలియన్ డాలర్లు వసూలు చేస్తుంది. అంటే, మన కరెన్సీలో రూ.8 కోట్లు అన్నమాట! ఈ కారణంగానే బడ్జెట్ ఎంత పెరిగినా యూఎస్ వసూళ్లతో కవర్ అయిపోతుందని ధీమాగా ఉంటారు మన మూవీ మేకర్స్. ఓవర్సీస్ మార్కెట్‌ను నమ్ముకునే టాలీవుడ్ దర్శక నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటారు. కానీ ఈ కొత్త పన్ను విధానంతో మార్కెట్ లెక్కలన్నీ తారుమారయ్యే అవకాశాలున్నాయి. 

దర్శకనిర్మాతల డాలర్ డ్రీమ్స్ కల్లాస్! 

ప్రపంచ మార్కెట్లో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. టాలీవుడ్ నుంచి వచ్చే భారీ బడ్జెట్ చిత్రాల కోసం ప్రపంచంలోని కొన్నిదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తాయి. ముఖ్యంగా భారతీయ చిత్రాలకు మన దేశం తర్వాత అమెరికానే అతిపెద్ద మార్కెట్. అక్కడ సినిమా హిట్ అయితే నిర్మాతలకు డాలర్ల వర్షం ఖాయం. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇకపై దర్శకనిర్మాతల డాలర్ డ్రీమ్స్ ఖల్లాస్ కానున్నాయి. ఎందుకంటే అక్కడ ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేస్తుంటారు.

‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘సలార్’ ‘కల్కి 2898ఏడీ’, ‘పుష్ప2’ లాంటి సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. రీసెంట్‌గా విడుదలైన ‘హిట్3’ చిత్రం ఇప్పటికే దాదాపు 2 మిలియన్ డాలర్ల వరకూ వసూళ్లు రాబట్టింది. అంతకుముందు కొన్ని చిన్న, మధ్య స్థాయి సినిమాలు కూడా నార్త్ అమెరికాలో మంచి గ్రాస్ రాబట్టాయి. కానీ ఇప్పుడు అక్కడ బయ్యర్లకు, నిర్మాతకు మిగిలేదేమీ ఉండదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  

అమెరికన్ సినిమాలకూ కష్టమేనా..?

ట్రంప్ నిర్ణయంతో అమెరికన్ సినిమాకూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కుదేలైపోయింది. వార్నర్ బ్రదర్స్, వాల్ట్‌డిస్నీ, పారామౌంట్ లాంటి పెద్ద కంపెనీలు అమెరికాలో ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా విదేశాల్లో సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ పన్ను విధానం ప్రకారం, అమెరికా బయట నిర్మించే సినిమాలపై నూరు శాతం పన్ను విధిస్తే.. ఆ కంపెనీలన్నీ తీవ్రంగా నష్టపోతాయి. ఓటీటీ నిర్మాణాలపైనా ఈ ప్రభావం పడుతుంది. 

డిస్ట్రిబ్యూటర్లకు నష్టం.. ప్రేక్షకులపై భారం.. 

సినిమాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లను పూర్తిగా విదేశాల్లో నిర్మించిన సినిమాలకే ఈ సుంకాలు విధిస్తారా? లేక విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న అమెరికన్ స్టూడియోలపైనా ఈ భారం పడుతుందా? అనేది ఇప్పుడు అందరికీ సందేహమే! థియేటర్లర్లే కాక ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాకు కూడా ఈ టారిఫ్‌లు ఉంటాయా? అనేదీ తెలియాల్సి ఉంది. విదేశీ చిత్రాలకు 100 శాతం సుంకం విధానం అమలైతే ఇటు డిస్ట్రిబ్యూటర్లకు నష్టం, అటు ప్రేక్షకులకు భారం తప్పదు.

ఉదాహణకు ఓ అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఒక మిలియన్ డాలర్‌కు భారతీయ సినిమా కొనుగోలు చేస్తే మరో మిలియన్ డాలర్‌ను సుంకంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూటర్ రెట్టింపు ధర చెల్లించి ఇండియన్ సినిమాను కొనుగోలు చేసినట్టవుతుంది. ఈ భారాన్ని తానొక్కడే మోయలేడు కాబట్టి, లాభాల కోసం టికెట్ ధరల్ని పెంచేస్తారు. అంతిమంగా ఆ భారం ప్రేక్షకుడిపై పడుతుంది. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే.. ఇప్పుడున్న దానికి రెట్టింపు ధర చెల్లించి ఇండియన్ సినిమాలను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్ ఆసక్తిచూపించరు. ఏదేమైనా అమెరికా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్న ఇండియన్ మేకర్స్‌కైతే ట్రంప్ పెద్ద షాకే ఇచ్చాడని చెప్పాలి. 

ఇప్పటికే డీల్ ముగించినవాళ్లలో గందరగోళం.. 

మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న విదేశీ చిత్రాలను ఇప్పటికే కొనుగోలు చేసినవారి పరిస్థితి గందరగోళంగా ఉంది. వీరు ఇప్పుడు సుంకాలు కట్టాల్సి వస్తే ఆర్థికంగా తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని సినీరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘సలార్2’, ‘స్పిరిట్’, ‘వార్2’ వంటి భారతీయ సినిమాలు త్వరలో ఓవర్సీస్‌లో విడుదల కానున్నాయి. అమెరికా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే సౌత్ ఇండియాలో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ప్రధానంగా చిరంజీవి ‘విశ్వంభర’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’, ధనుష్ ‘కుబేర’, ‘పవన్ కల్యాన్ ‘హరిహర వీరమల్లు’ ఉన్నాయి.