12-03-2025 12:04:49 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): టీఎస్పీఎస్సీ గత సంవత్సరం నిర్వహించిన గ్రూప్ 2 ఫలితాలు(TSPSC Group 2 Results 2025) మంగళవారం విడుదల చేయగా జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్ శివకృష్ణ రాష్ట్రంలో 19 ర్యాంకు జోన్ లో 4వ ర్యాంకు పొందాడు. టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో 412.050 మార్కులు సాధించి ర్యాంకు పొందాడు. శివకృష్ణ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్ సత్యనారాయణ, వాణిశ్రీ ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు. సత్యనారాయణ జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ లో విధులు నిర్వహిస్తుండగా శివకృష్ణ అదే పాఠశాలలో చదివి అనంతరం త్రిబుల్ ఐటీ లో సీటు సంపాదించారు.
అనంతరం సింగరేణి లో నిర్వహించిన ఉద్యోగానికి 12వ ర్యాంకు సాధించి కాసిపేట గనిలో విధులు నిర్వహిస్తునే, గత సంవత్సరం ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఆడిట్ సెక్షన్ లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా గ్రూప్ 2 ఫలితాల్లో 19వ స్థానం సంపాదించి అందరి మన్ననలు పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో గ్రూప్ 1 సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.