వివాదంలో తుంగతుర్తి ఎమ్మెల్యే..?
లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే మామూళ్ళు అంటూ ఓ వీడియో వైరల్..!
సూర్యాపేట (విజయక్రాంతి): తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు(MLA Mandula Samuel) మరో వివాదంలో చిక్కుకున్నాడు. నియోజకవర్గంలోని వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆయన వాయిస్ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎమ్మెల్యే మామూళ్ల వ్యవహారం బయటపెట్టాలనే ఉద్దేశ్యంతోనే సీక్రెట్ కెమెరాతో సిండికేట్ మాఫియా ఆపరేషన్ చేసి దానిని కావాలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ప్రచారం సాగుతుంది.
ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా, రోజుకు రూ.లక్ష ఖర్చు వస్తుంది, డీజిల్ కు కూడా డబ్బులు లేవు, ప్రభుత్వం ఇచ్చే జీతం ఏమి చాలట్లేదు, టీ, టిఫిన్ లకు ఇబ్బంది అవుతుందని, మనకు సహకరించిన వారికి దేనికైనా సహకరిస్తామని, అధికారులు ఎవరైనా మన మాట వినాల్సిందే అంటూ వైరల్ అవుతున్న వీడియోలో వినిపిస్తుండడం గమనించదిగిన విషయం. ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కొందరు కావాలనే పనికట్టుకొని ఇటువంటి అర్థం లేని వీడియోలను వైరల్ చేస్తున్నారంటూ పలువురు ఎమ్మెల్యే అనుచరులు అభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం.






