29-10-2025 12:10:14 PM
అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం(Lingala mandal) అవుసలికుంట అంబటిపల్లి గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బుధవారం ఉదయం ఓ కారు కొట్టుకుపోయింది. అంబటిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ఉదయం అంబటిపల్లి నుంచి లింగాలకు కారులో బయలు దేరారు. మార్గం మధ్యలో ఆయన స్విఫ్ట్ కారు నీటి ప్రవాహంలో వాగు దాటించే ప్రయత్నం చేయడంతో వరద ఉధృతికి కారు కొద్ది దూరం కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అప్రమత్తమై ట్రాక్టర్ సహాయంతో వెంకటరెడ్డిని తాడు సహాయంతో బయటకు తీశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని(Nagarkurnool District) పలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉరుకొండ, కల్వకుర్తి, వెల్దండ, ఆమన్ గల్, వంగూర్, చారగొండ మండలాల్లో నిన్న రాత్రి నుంచి జోరుగా వాన కురుస్తోంది. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అచ్చంపేట- శ్రీశైలం ప్రధాన రహదారిపై చంద్రవాగు వరద ప్రవాహం బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తోంది. మిడ్జిల్ మండలం కొత్తూరు- వేలుగోముల మధ్య దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దుందుభి వాగు ఉద్ధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ భారీ వర్షం కురుస్తోంది. భారీగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.