29-10-2025 01:43:51 AM
చెరువు చుట్టూ పార్కులు, వాకింగ్ ట్రాక్, ఆట స్థలాలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు
నవంబర్ నాటికి పూర్తి: కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఒకప్పుడు నిజాం రాణులు స్నానమాచరించారని, ఈ నీటితో సుగంధ ద్రవ్యాలు తయారుచేసేవారని ప్రతీతి ఉన్న పాతబస్తీలోని చారిత్రాత్మక బమృక్నుద్దౌలా చెరువు మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. కబ్జాలతో కుంచించుకుపోయి, ఉనికి కోల్పోయే దశకు చేరిన ఈ చారిత్రక సంపదకు హైడ్రా పూర్వ వైభవాన్ని తెస్తోంది.
నవంబర్ నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తి చేసి, చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని లక్ష్యం గా పెట్టుకుంది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం చెరువు వద్ద జరుగుతున్న పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
18 ఎకరాలకు పునరుజ్జీవం
వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చెరువును భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన పై ఉందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. “గత ఏడాది ఆగస్టులోనే చెరువు ఆక్రమణలను తొలగించాం. 18 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండాల్సిన చెరువు, కబ్జాల కారణంగా కేవలం 4.12 ఎకరాలకు పరిమిత మైంది.
ఇప్పుడు ఆక్రమణలు తొలగించి, తిరిగి పూర్తిస్థాయిలో 18 ఎకరాల మేర చెరువును పునరుద్ధరిస్తున్నాం. దీనివల్ల వరద నియంత్రణతో పాటు, భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరుగుతాయి” అని ఆయన వివరించారు. చెరువులోకి వరద నీరు వచ్చిపోయేందుకు వీలుగా నిర్మిస్తున్న ఇన్‌లెట్, ఔట్‌లెట్లను ఆయన పరిశీలించారు.
1770లో చెరువు నిర్మాణం
1770లో మూడవ నిజాం ప్రధాని నవాబ్ రుక్న్‌ఉద్‌దౌలా ఈ చెరువును నిర్మించారు. ఒకప్పుడు ఇది వందలాది ఎకరాల్లో విస్తరించి ఉండేదని స్థానిక వృద్ధులు చెపుతారు. నిజాం రాజులు మీరాలం ట్యాంక్‌ను, రాణులు ఈ బమృక్నుద్దౌలా చెరువును స్నానాల కోసం వినియోగించేవారని ప్రతీతి. అంతేకాదు, చెరువులో వనమూలికలు వేసి, ఆ నీటి ఊటను నిజాంలు ఔషధంగా తాగేవారని, సువాసనలు వెదజల్లే పూల వల్ల ఈ నీటిని సుగంధాల తయారీ కోసం అరబ్ దేశాలకు సైతం తీసుకెళ్లేవారని స్థానికులు ఆసక్తికర గాథలను వివరిస్తున్నారు.
అడ్డంకులను దాటి ముందుకు
హైడ్రా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం అనేక అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగుతోంది. బతుకమ్మ కుంట పనులు కోర్టు కేసులతో ఆలస్యమైనా, చివరకు పూర్తి చేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. బమృక్నుద్దౌలా చెరువు వద్ద కూడా కొందరు స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, అర్హులకు టీడీఆర్ ఇప్పిస్తామని కమిషనర్ హామీ ఇచ్చి పనులు కొనసాగిస్తున్నారు. ఈ చెరువుతో పాటు, కూకట్‌పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తుమ్మిడి కుంట చెరువులను కూడా డిసెంబర్ 9 నాటికి అందుబాటులోకి తీసుకు రావాలని హైడ్రా లక్ష్యంగా పెట్టుకుంది.
ఆధునిక హంగులతో సుందరీకరణ
చరిత్రను కాపాడుతూనే, చెరువుకు ఆధునిక హంగులు అద్దుతు న్నారు. చెరువు చుట్టూ బండ్ నిర్మించి దానిపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. పటిష్టమైన ఫెన్సింగ్, సీసీటీవీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. చిన్నారు ల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలు, వృద్ధులు సేద తీరేందుకు పార్కులు, సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. యువత కోసం ఓపెన్ జిమ్‌లు, పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు, పచ్చిక బయళ్లు ఏర్పాటు చేస్తున్నారు. నిజాం కాలం నాటి రాతి కట్టడాలను చెక్కుచెదరకుండా పటి ష్టం చేస్తున్నారు.