29-10-2025 11:56:30 AM
నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లా కేంద్రంలోని హజికన్‌పేటకు చెందిన చింతామణి (45 ) అనే మహిళ మట్టిమిద్దే కూలిన ఘటనలో మహిళ స్వల్పగాయాలతో బయట పడిన సంఘటన పేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే తీవ్ర వర్షాల కారణంగా రాత్రి 11 గంటల సమయంలో మట్టి మిద్దె కూలిపోయింది. ఈ ఘటనలో చింతామణి శిధిలాల కింద చిక్కుకొని, కేవలం తల మాత్రమే బయటకు కనిపించింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక యువకులు నారాయణపేట టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో అరగంటపాటు శ్రమించి చింతామణిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆమెను పోలీసు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆమ చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. అనంతరం ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... వర్షాల సమయంలో పాత బలహీనమైన ఇళ్లలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ప్రమాదం జరిగినా వెంటనే నారాయణపేట పోలీసులకు లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న ఎస్సైని సిబ్బందిని అభినందించారు.