04-09-2025 01:33:50 AM
లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వైనం
నిజామాబాద్, హాజీపూర్ (మంచిర్యాల), సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఇద్దరు ప్రభు త్వ అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా హాజిపూర్ మం డలం కర్ణమామిడి పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకటస్వామి, నిజామబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసాచారి ఏసీబీకి చిక్కారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి పంచాయతీ సెక్రటరీ అక్కల వెంకట స్వామి లబ్ధిదారుడికి పని చేసేందుకుగాను లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు బుధ వారం పట్టుబడ్డాడు. ఏసీబీ ఆదిలాబాద్ రేంజ్ ఇన్‌చార్జి డీసీపీ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు మేరకు.. కర్ణమామిడి గ్రామానికి చెందిన దొల్క నాగమణి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా ఇల్లు మంజూరైంది.
ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి మొదటి విడత బిల్లు కోసం నాగమణి పంచాయతీ సెక్రటరీని సంప్రదించగా, ఆన్ లైన్ లో ఇంటి ఫొటోలు అప్ లోడ్ చేయడానికి రూ. 30 వేలు డిమాండ్ చేయగా రూ. 20 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధ వారం నాగమణి ఇంటి వద్ద పంచాయతీ సెక్రటరీ వెంకట స్వామి రూ. 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
వెంకట స్వామిని అరెస్టు చేసి కరీంనగర్ ఎసీబీ కోర్టులో గురువారం ఉదయం హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడిలో డీఎస్పీ వెంట ఇన్ స్పెక్టర్లు కిరణ్, తిరుపతి తో పాటు కానిస్టేబుల్ ఉన్నారు. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్‌ఐ శ్రీనివాసా చారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఆస్తి పన్ను అంచనా డోర్ నెంబర్ కేటాయింపు కోసం ఒక బాధితుడి నుంచి ౧౦వేల రూపాయల లంచం డబ్బులు డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు బుధవారం ఏడు వేల రూపాయలు ఆర్ ఐ కి ఇస్తుండగా నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ జిల్లా అధికారి శేఖర్ గౌడ్ తెలిపారు.