11-11-2025 10:22:56 PM
జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్..
చిట్యాల (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులోకి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లర్స్ వేగంగా రైస్ మిల్లులో దించుకోవాలని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం చిట్యాల పట్టణ పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లును ఆకస్మికoగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లుకు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటనే దించుకునేలా రైస్ మిల్లర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని దించుకునే ప్రక్రియ ఈ మిల్లులో ఆలస్యం అవుతుందని తమకు కంప్లైంట్ వచ్చిందని దానికి గల కారణాలను ఆయన తెలుసుకున్నారు. ఏదేమైనా ధాన్యం మిల్లులో దిగుమతి వేగవంతంగా జరిగేలా చేసి రైతులకు అన్నివిధాలా సహకరించాలని సూచించారు.
అనంతరం భువనగిరి రోడ్డులో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయో ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి తేమశాతాన్ని సక్రమంగా పరిశీలిస్తున్నారా లేదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా దాన్యం వేగవంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం పట్టణ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ దరఖాస్తులు ఏవి ఉండకుండా వెంటనే పరిష్కారం చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయనతో పాటు నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి ఉన్నారు. ఇంచార్జ్ తాసిల్దార్ బి. విజయ, సిబ్బంది ఉన్నారు.