calender_icon.png 12 November, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాక్షి సంతకం కోసం పోలీసుల దౌర్జన్యం

11-11-2025 10:57:34 PM

గంజాయి కేసు లో సాక్షి సంతకం పెట్టాలని చైతన్యపురి  పోలీసుల దౌర్జన్యం

ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కొత్తపేట సబ్ స్టేషన్ సిబ్బంది 

ఎల్బీనగర్: గంజాయి స్వాధీనం చేసుకున్న కేసులో సాక్షి సంతకం పెట్టాలని విద్యుత్ శాఖ సిబ్బందిని పోలీసులు వేధింపులకు గురి చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.  వేధింపులకు గురి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో విద్యుత్ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చైతన్యపురి పోలీసులు తనిఖీల్లో భాగంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సాక్ష్యంగా సంతకం పెట్టాలని కొత్తపేటలోని విద్యుత్ శాఖ సెక్షన్ సిబ్బందిని కోరారు. సోమవారం రాత్రి ముగ్గురు కానిస్టేబుళ్లు కొత్తపేట సెక్షన్ ఆఫీసుకు వెళ్లి, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఇబ్బందులకు గురి చేశారు.

తమ శాఖ ఉన్నతాధికారులు చెబితే సంతకం పెడుతామని, నిరాకరించారు. తాము చెప్పినా వినరా? అంటూ ఆగ్రహం చెందిన కానిస్టేబుళ్లు విద్యుత్ శాఖ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై కొత్తపేట ట్రాన్స్ కో సెక్షన్ అధికారులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... రక్షించాల్సిన పోలీసులు తమపై దాడి చేయడం విచారకరమన్నారు. తమపై దురుసుగా ప్రవర్తించి, ఇబ్బంది పెట్టిన చైతన్యపురి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో కొత్తపేట సెక్షన్ ఆఫీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సమన్వయ లోపంతో వివాదం 

చైతన్యపురి సీఐ వివరణ 

నాగోల్ చౌరాస్తా దగ్గర నిమంత్రన్ ప్యాలెస్ సమీపంలో గంజాయిని రవాణ చేస్తున్న శ్యామల అరవింద్(భువనగిరి జిల్లా గొల్లపల్లి గ్రామం)ని చైతన్యపురి పోలీసులు అదుపులోకి తీసుకుని, 3.542 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరవింద్ పోలీసు వారితో మాట్లాడుతూ తన కాలనీకి చెందిన వేణు అతడి నలుగురు స్నేహితులతో కలిసి తనని కిడ్నాప్ చేసి, హయాత్ నగర్ లో తన స్నేహితుడి ఇంట్లో అక్రమంగా నిర్బంధించినారని ఫిర్యాదు చేశాడు. దీంతో చైతన్యపురి పోలీసులు అరవింద్ తోపాటు వేణు, అతడి నలుగురు స్నేహితులపై కేసు నమోదు చేశారు.

కాగా, పోలీసుల అదుపులో ఉన్న అరవింద్ 10వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో మరికొంత గంజాయి తన ఫ్రెండ్ చంటి వద్ద ఉన్నదని, తనను తీసుకవెళ్తే గంజాయితో సహా చంటిని పట్టిస్తానని చెప్పాడు. అక్కడికి వెళ్లిన తర్వాత చంటిని గంజాయితో పట్టుపట్టాడు. ఈ ఘటనలో పంచనామ , రాయడానికి పంచులుగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అవసరమని చెప్పారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉన్న సబ్ స్టేషన్ సిబ్బందిని సంతకం పెట్టాలని పోలీసులు కోరారు. వారికి అవగాహన లేకపోవటంతో పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు సీఐ సైదులు వివరించారు.