11-11-2025 11:02:59 PM
- ఉద్యోగం రాకపోవడంతో జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న బిటెక్ విద్యార్థి
-5 తులాల 14 గ్రాముల బంగారం
-2.85 లక్షల నగదును,బైక్ స్వాధీనం
-నిందితుడు అరెస్టు...
-హుజూర్ నగర్ సీఐ చరమందరాజు
హుజూర్‌నగర్: బీటెక్ చదివి ఉద్యోగం రాకపోవడంతో జల్సాలకు అలవాటు పడి తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో హుజూర్ నగర్ సీఐ చరమందరాజు కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 5న హుజూర్ నగర్ మండల పరిధిలోని వేపలసింగారం గ్రామానికి చెందిన ముడెం గోపిరెడ్డి ఇంటికి తాళం వేసి వెళ్లడంతో బీరువాలో దాచిన బంగారు ఆభరణాలు, 90 వేల నగదును ఎత్తుకెళ్లారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బాధితుడు తన వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లడంతో ఇదే అదునుగా గమనించిన మల్లికార్జున్ రెడ్డి ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన బంగారు ఆభరణాలతో పాటు, 90 వేల రూపాయల నగదును దొంగిలించాడు. దొంగిలించిన బంగారాన్ని కరిగించి,నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడెం గోల్డ్ షాపులలో విక్రయించేందుకు వెళ్తూతుండగా హుజూర్ నగర్ ఎస్ఐ మోహన్ బాబు వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి కంగారు పడడంతో నిందితుడుపై అనుమానం రావడంతో పోలీసులు విచారించగా నిందితుడు నేరం ఒప్పుకున్నాడు.
బీటెక్ చదివి ఉద్యోగం రాకపోవడంతో జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పడుతున్నాడని గతంలో నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు అయినట్లు తెలిపారు.నిందితుడు వద్ద 5 తులాల14 గ్రాముల బంగారం, 90 వేల నగదు,బైక్, సెల్ పోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తును సీసీ కెమెరాల పుటేజీ సహాయంతో కేసును ఛేదించిన ఎస్ఐ మోహన్ బాబు,సిబ్బంది గోలి శంభయ్య, నాగరాజు, వీరప్రసాద్, వెంకటేశ్వర్లులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసును చేధించి దొంగను పట్టుకోవడం తమకు సవాల్‌గా మారిందని, దానిని ఛాలెంజ్‌గా స్వీకరించి పట్టుకున్నామని ఎస్ఐ మోహన్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ మోహన్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.