11-11-2025 10:49:29 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఓ వ్యక్తి మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన బోర సురేష్ కుమారుడు బోర నరేష్ గౌడ్(30) హైదరాబాద్ అమీర్ పేట్ లో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. నరేష్ కు ఇంట్లో వారు నాలుగేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరడం లేదని తీవ్ర మనస్థాపానికి గురై మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని మాధవరెడ్డి ఫ్లైఓవర్ సమీపంలో గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మృతుని ఫోన్ ఆధారంగా అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పెళ్ళి సంబంధాలు కుదరకపోవడం వల్లే నరేష్ మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.