18-05-2025 09:14:03 AM
కంట్లో కారం కొట్టిన అత్త, భార్య..
మహబూబాబాద్ (విజయక్రాంతి): అనుమానంతో తరచూ కూతుర్ని వేధిస్తున్నాడని మామ అల్లుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం ధర్మారం తండాలో జరిగింది. ధర్మారం తండాకు చెందిన బానోత్ వీరన్న కైలా దంపతుల కుమార్తె మౌనికతో మహారాష్ట్రలోని బళార్షకు చెందిన లునావత్ బాల(35) తో 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బాల హైదారాబాద్ లోని లింగంపల్లిలో వాటర్ మెన్ గా పనిచేస్తున్నాడు. బాల మౌనిక దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే జీవనం సాగిస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మౌనిక పుట్టినిల్లు ధర్మారం తండాకు వచ్చింది.
దీనితో బాల తన భార్యను తిరిగి తీసుకెళ్ళడానికి ధర్మారం తండాకు రాగా భార్య భర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ క్రమంలో బాల కంట్లో భార్య మౌనిక, అత్త కైలా కారం కొట్టగా, మామ వీరన్న కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన తండా వాసులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి బాల మరణించాడు. ఈ సంఘటనపై మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కేసముద్రం ఎస్ ఐ మురళీధర్ రాజ్ దర్యాప్తు చేపట్టారు.