22-12-2025 01:49:34 AM
యుద్ధంలో ధర్మనీతి శ్రీకృష్ణుడిది
సీతలో మనోధైర్యాన్ని నింపిన హనుమంతుడు
మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి
పుణె పుస్తకమహోత్సవంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: తన దృష్టిలో శ్రీకృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని విదేశాంగమంత్రి జైశంకర్ పేర్కొన్నారు. భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలు, పాలనాపరమైన విధానాలు, రాజకీయాల గురించి విదేశాంగ మంత్రి పుణెలోని పుస్తక మహోత్సవంలో మాట్లాడారు. దౌత్యవేత్తల విధుల గురించి మాట్లాడుతూ.. భారత్‌కు వ్యూహాత్మక రాజకీయాలు, రాజ్యనిర్వహణ తెలియవని అనేకమంది విదేశీ రచయితలు పుస్తకాల్లో రాసిన వ్యాఖ్యలను పదే పదే చదివి విసిగిపోయానని తెలిపారు. మనమంతా సంస్కృతీ, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పాటిస్తూ పెరిగామని చెప్పారు. అవి ఎంతో గొప్పవని, వాటి గురించి విదేశీయులకు తెలియవు కాబట్టి.. ఎన్నో ఏళ్లుగా భారత్ పాటిస్తున్న రాజనీతిని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజాపాలన, రాజకీయ వ్యూహాలు..
“రామాయణంలోని ప్రజా పాలన, సంక్లిష్ట పరిస్థితులు, రాజకీయ వ్యూహాలు మన పరిపాలనా విధానాలను తెలియజేస్తాయి. ఆ సమయంలో హనుమంతుడు దౌత్యవేత్తగా తన విధులను ఎంతో చక్కగా నిర్వహించాడు. సీతకు సంబంధించిన సమాచారం తీసుకురమ్మని ఓ పనిమీద లంకకు పంపితే.. అక్కడికి వెళ్లి పది పనులు చేసుకువచ్చాడు. సీతలో మనోధైర్యాన్ని, రావణుడిలో భయాన్ని నింపాడు. అదే విధంగా మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా కౌరవులు, పాండవుల మధ్య సంధి కోసం ప్రయత్నించాడు. యుద్ధంలో ధర్మం వైపు నిలబడ్డాడు. అంతకంటే గొప్ప దౌత్యవేత్తలను మనం ఇంకెక్కడ చూడగలం. వారిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాను ” అని జైశంకర్ అన్నారు.