calender_icon.png 22 December, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వీబీ రామ్ జీ’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

22-12-2025 01:51:51 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ’వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ - గ్రామీణ్’ (వీబీ-జీ రామ్ జీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోదం తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు. ఈ నూతన చట్టం ప్రకారం గ్రామీణ కుటుంబాలకు కల్పించే పని దినాల సంఖ్యను ఏడాదికి 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు.  ఈ పథకానికి అయ్యే నిధుల కేటాయింపులో కేంద్రం భారీ మార్పులు చేసింది.

గతంలో కూలీల వేతనాలను కేంద్రమే పూర్తిగా భరించేది. కానీ ఇకపై కేంద్రం 60శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. ఈ మార్పు వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ పనుల సమయంలో కూలీల కొరత తలెత్తకుండా ఈ చట్టంలో కీలక నిబంధన చేర్చారు. పంటల కోత, విత్తనాలు నాటే సమయాల్లో ఏడాదికి గరిష్టంగా 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేసే అధికారం ఉంటుంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఉపాధి హామీ కింద చేసే పనుల పరిధిని కూడా తగ్గించారు. కేవలం నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి ఆస్తుల సృష్టి, వాతావరణ మార్పులను తట్టుకునే పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.