17-05-2025 04:42:10 PM
నూతన భవన నిర్మాణ పనులు పురోగతి అభినందనీయం..
పూర్వ విద్యార్థులూ, దాతలారా.... శిశుమందిర్ కు సహకరించండి..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్..
కరీంనగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ను సందర్శించిన కేంద్రమంత్రి..
నూతన భవన నిర్మాణ పనుల పురోగతిపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన బండి సంజయ్..
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ లోని సరస్వతి శిశుమందిర్ లో ఈ విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ(CBSE) విధానాన్ని అమలు చేయడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) హర్షం వ్యక్తం చేశారు. మానవీయ విలువలను పెంపొదిస్తూ దేశ భవిష్యత్ కోసం నవ తరాన్ని తయారు చేయడంలో సరస్వతి శిశు మందిర్ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. శిశుమందిర్ లో చదువుకోవడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకుని ప్రజలకు సేవ చేయగలుగుతున్నానని చెప్పారు. ఈరోజు ఉదయం కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా శిశు మందిర్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. తరగతి గదులను సందర్శించారు. భవన నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పనుల పురోగతిపట్ల సంతోషం వ్యక్తం చేశారు.