23-08-2025 03:35:17 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ(CPI) అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డికి ఎంసీపీఐయూ నాయకులు నివాళులర్పించారు. శనివారం బెల్లంపల్లి ఎంసీపీఐ(యూ) కార్యాలయంలో సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసుపులేటి వెంకటేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సురవరం సుధాకర్ రెడ్డి మరణం యావత్ భారత దేశ ప్రజలకు, కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటనన్నారు.
పాలమూరు బిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న మహబూబ్నగర్ జిల్లాలోని కొండ్రావ్పల్లి గ్రామంలో జన్మించారని, ఆయన తండ్రి ఎస్.వెంకట్రామి రెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడని, తెలంగాణ రైతాంగ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారనన్నారు. సుధాకర్ రెడ్డి కర్నూలు మున్సిపల్ హై స్కూల్, కోల్స్ మెమోరియల్ స్కూల్లోచదివి, 1964-65 ఉస్మానియా కాలేజీ, కర్నూలు నుండి బి.ఏ పూర్తి చేసి, అనంతరం(హిస్టరీ) 1967లో ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ నుండి ఎల్ఎల్బీ డిగ్రీ పొందారన్నారు. విద్యార్థి ఉద్యమ నాయకుడుగా 15సంవత్సరాల వయసులోనే సురవరం విద్యార్థుల సమస్యలపై ఉద్యమం ప్రారంభించారని వివరించారు. కర్నూలులో పెద్ద విద్యార్థి ఉద్యమానికి నాంది పలికారని, సామాజిక ఉద్యమాలకు అండగా నిలిచారని, ఆయన తొలి శ్వాస విడిచే వరకు పీడిత ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించారన్నారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్, సతీష్, రమేష్ పాల్గొన్నారు.