01-12-2024 12:29:31 AM
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ‘ఇస్కాన్’ టార్గెట్‌గా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గత మంగళవారం ఇస్కాన్ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్‌ను రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసినప్పటినుంచీ ఆ సంస్థను నిషేధించాలనే డిమాండ్ మొదలైంది. ఈ మేరకు ఢాకా హైకోర్టులో ఓ రిట్ పిటిషన్ కూడా దాఖలయింది.
కృష్ణదాస్‌ను అరెస్టు చేసే సమయంలో తలెత్తిన అల్లర్లలో ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మృతి చెందడంతో దీనికి ఇస్కానే కారణమని, ఆ సంస్థను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో మరోమార్గంలో ఇస్కాన్‌పై చర్యలు మొదలయ్యాయి. కృష్ణదాస్ సహా ఇస్కాన్‌కు చెందిన 17 మంది బ్యాంక్ ఖాతాలను నెలరోజుల పాటు స్తంభింపజేసింది.
మరోవైపు శుక్రవారం చిట్టగాంగ్‌లో మరో ఇద్దరు ఇస్కాన్ సభ్యులను అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జైలులో ఉన్న కృష్ణదాస్‌కు మందులు, ఆహారం ఇవ్వడం కోసం వెళ్లిన ఈ ఇద్దరిని అరెస్టు చేశారని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో తెలిపారు. చిట్టగాంగ్‌లో హిందువులకు చెందిన పలు దుకాణాలు, ఆలయాలపై కూడా దాడులు జరిగాయి. కృష్ణదాస్‌కు తమ సంస్థతో ఎలాంటి సంబంధాలు లేవని బంగ్లాదేశ్ ఇస్కాన్ సంస్థ ప్రకటించినప్పటికీ ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇస్కాన్ అంతర్జాతీయ విభాగం తెలిపింది.
అంతేకాకుండా కృష్ణదాస్ విడుదలకు డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలకు పిలుపునిచ్చింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత అక్కడి ప్రభుత్వానిదేనని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణదాస్‌ను వెంటనే జైలునుంచి విడుదల చేయాలని మనదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మరోవైపు కృష్ణదాస్ అరెస్టుపై భారత్‌లో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణదాస్ అరెస్టును నిరసిస్తూ కోల్‌కతాలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఇస్కాన్ ప్రతినిధులు ప్రదర్శన నిర్వహించారు. హిందుత్వ సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ కూడా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై స్పందించాయి.అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణం ఆపేయడంతో పాటుగా కృష్ణదాస్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. అంతేకాదు బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టాలని కూడా కేంద్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేసింది.
ఇంత జరుగుతున్నా మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు సరికదా, దేశంలో హిందువులు సురక్షితంగానే ఉన్నట్లు వాదిస్తోంది. అనూహ్య పరిణామాల మధ్య షేక్ హసీనా ప్రధాని పదవినుంచి దిగిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపైన, ఆలయాలపైన దాడులు పెరిగాయి. వాస్తవానికి బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
తుపానులు,వరదలు లాంటి ప్రకృతి విపత్తుల సమయంలో వేలాది మందికి ఆహారాన్ని అందించడమే కాకుండా కుల, మతాలతో సంబంధం లేకుండా అభాగ్యులకు సేవ చేయడమే ధ్యేయంగా పని చేస్తోంది. ఇదే అక్కడి మతతత్వవాద వర్గాలకు నచ్చడం లేదు. బంగ్లాదేశ్ జనాభాలో ఒకప్పుడు హిందువులు 20శాతం దాకా ఉండేవారు. అయితే ఇప్పుడు అది 8 శాతానికి తగ్గిపోయింది. హసీనా అధికారంలో ఉన్నప్పుడు వారికి ప్రభుత్వం వైపునుండి రక్షణ ఉండేది.
ఇప్పుడు అదే కరవైంది. దీంతో మానవత్వానికి మచ్చతెచ్చే విధంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడానికి అక్కడ ఎన్నికైన ప్రభుత్వం లేకపోవడం ఒక కారణంగా కనిపిస్తోంది. అయినప్పటికీ దౌత్యపరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవి ఎంతమేరకు ఫలిస్తాయో చూడాలి.