13-09-2025 07:03:01 PM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమిష్టిగా పనిచేస్తూ రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, డిఏఓ విజయనిర్మల, డిసిఓ వెంకటేశ్వర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఏఓలతో యూరియా సరఫరా, పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయడానికి, ఇప్పటికే అమలు చేస్తున్న ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ఉద్యోగి రైతు వేదికలు, ప్రాథమిక సహకార సొసైటీలు, తదితర కొనుగోలు కేంద్రాల వద్ద కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
రైతులకు వస్తున్న యూరియా స్టాక్ వివరాలను తెలియపరచి వారిని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా ముందస్తు సమాచారం ఇవ్వాలని, ఇప్పటివరకు యూరియా అందని రైతుల వివరాలను సేకరించి వారికి యూరియా సరఫరా చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, టెంట్స్, చైర్స్ , సదుపాయాలు కల్పించాలని, క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. యూరియా పంపిణీ విధులలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియా,వివిధ సామాజిక మాధ్యమాలలో యూరియా రాదేమో అని, కొన్నిచోట్ల అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, అలాంటి అసత్య ప్రచారాలను మండల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే 18 మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ, సహకార, సంఘాల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందనీ, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన ఉద్యోగులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
మండల స్థాయి యూరియా పంపిణీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించి పక్కాగా యూరియా పంపిణీ చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న కొనుగోలు కేంద్రాలతో పాటు అదనపు కొనుగోలు కేంద్రాల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రద్దీ ఎక్కువగా ఉన్నచోట అదనపు క్యూ లైన్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, పోలీస్ సిబ్బంది ద్వారా రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాకు రావాల్సిన యూరియా కోటా తోపాటు అదనపు యూరియా కోసం రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారుల ద్వారా సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. యూరియా సరఫరా అయ్యే వాహనాల యొక్క వివరాలను పక్కాగా సమాచారం తెలుసుకొని నిత్యం గమనిస్తూ గమ్యం చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు నిత్యం కేంద్రాలను తనిఖీ చేస్తూ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తొర్రూరు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు, గణేష్, కృష్ణవేణి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు అజ్మీరా శ్రీనివాసరావు, విజయ్ చంద్ర, శ్రీనివాస్,తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.